పవన్ ఆయన్ను చూసి వాతలు పెట్టుకొంటున్నాడా..?
on Mar 29, 2016
టాలీవుడ్‌లో మిస్టర్ పర్‌ఫెక్ట్, పక్కా ప్రొఫెషనల్ డైరెక్టర్ అంటే.. ఎస్.ఎస్.రాజమౌళి పేరే చెబుతారు. ప్రతీదీ ఓ ప్లానింగ్ ప్రకారం, పక్కా కమిట్ మెంట్‌తో వర్క్ చేస్తాడు రాజమౌళి. ఆయన సాధిస్తున్న వరుస విజయాలకు ఆయన ప్లానింగ్, ప్రీ ప్రొడక్షన్ విషయంలో తీసుకొనే జాగ్రత్తలే ప్రధాన కారణం. బాహుబలి సినిమా మొదలెట్టక రెండేళ్ల ముందు నుంచీ గ్రౌండ్ వర్క్ చేసుకొంటూ వచ్చారు. కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి? పాత్రల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఏ పాత్రకు ఎవర్ని తీసుకోవాలి? సెట్స్ ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోవాలి? ఇలా అనేక విషయాల్లో పక్కాగా ప్లాన్ చేసుకొన్నారు. అందుకే బాహుబలి లాంటి భారీ కాన్వాన్ చిత్రం.. అనుకొన్నది అనుకొన్నట్టు తీయగలిగాడు.
ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా రాజమౌళినే ఫాలో అయ్యాడు.. సర్దార్ కోసం. ఈ సినిమాకి దర్శకుడు బాబీనే అయినా... అసలు సిసలు కర్త కర్మ క్రియ మొత్తం పవన్ కల్యాణే అన్నది జగమెరిగిన సత్యం. ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే అందించింది పవన్ కల్యాణే. దానికి తోడు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసేశాడట. అందుకే.. ఈ సినిమాపై ముందు నుంచీ పవన్ ని కమాండ్ ఉంటూనే ఉంది. పవన్ కథ రాసుకొన్నప్పటి నుంచీ.. తెరపై తన కథని చూసుకొన్నంత వరకూ రాజమౌళి అడుగు జాడల్లో నడిచాడని అర్థమవుతూనే ఉంది. ఈ సినిమాలో సెట్స్, పాత్రధారుల కాస్ట్యూమ్స్, వాళ్ల బాడీ లాంగ్వేజ్.. వీటన్నింటికి సంబంధించి యానిమేషన్ వర్క్ చేయించాడు పవన్. అదీ పక్కా హాలీవుడ్ స్థాయిలో! కొన్ని సన్నివేశాల్ని ముందుగానే యానిమేషన్‌లో చిత్రీకరించారు. దాంతో.. సెట్లో పని సులభమైపోయిందని టాక్. ఈ సినిమాలో విలన్ దగ్గర్నుంచి, రౌడీ గ్యాంగ్ వరకూ ప్రతీ ఒక్కరినీ పవనే దగ్గరుండి ఎంపిక చేసుకొన్నాడట. వాళ్లకు సంబంధించిన స్కెచ్చులు రెండేళ్ల క్రితమే రెడీ అయిపోయాయని, ఈ పనులన్నీ పవనే దగ్గరుండి చూసుకొన్నాడని టాక్.
బాహుబలి విషయంలో రాజమౌళి ఏం చేశాడో.. ఇప్పుడు సర్దార్ సెట్స్, కాస్ట్యూమ్స్, నటీనటుల ఎంపిక, ఇప్పుడు ప్రచారం పోకడ వీటన్నింటిలోనూ పవన్ అలాంటి ఎత్తుగడలే వేశాడని.. బాహుబలిని పవన్ ఫాలో అయ్యాడని.. ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. మరి రికార్డుల్లో, వసూళ్ల ప్రభంజనంలో, టెక్నికాలిటీలోనూ బాహుబలిని సర్దార్ ఫాలో అవుతాడా, ఆ స్టామినా పవన్ కల్యాణ్ కి ఉందా?? లేదంటే పవన్‌ని పులిని చూసి నక్క వాత పెట్టుకొన్న వ్యవహారమా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..