'కానిస్టేబుల్'లోని 'మేఘం కురిసింది' పాటను విడుదల చేసిన తలసాని
on Mar 14, 2025

చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన 'కానిస్టేబుల్' చిత్రంలోని 'మేఘం కురిసింది...' అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైనదని అన్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. భారీ బడ్జెట్ తో నిర్మించే పాన్ ఇండియా చిత్రాలలో కొన్ని మాత్రమే విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయని అన్నారు. సినీ పరిశ్రమలో తాము కూడా రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్ గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిత్ర హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



