కొరటాలకు కిక్కు నెత్తికెక్కిందా?
on Aug 17, 2015
విజయంతో పాటు 'వినయం' కూడా కలసి రావాలి అనిచెప్తుంటారు పెద్దలు. విజయం తాలుకు గర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా, ఎన్ని విజయాలొస్తే అంత తలొగ్గి ఉండడమే అసలు సిసలైన విజేత లక్షణం. అయితే ఈ టైపు క్యారెక్టర్లను తెలుగు చిత్రసీమలో అరుదుగానే కనిపిస్తుంటారు. ఒక్క హిట్టు పడగానే అంతా తామే చేసినట్టు పోజులు కొడుతుంటారు. తమ వెనుకే ప్రపంచం పరుగులు పెడుతున్నట్టు ఫీలైపోతుంటారు. ఇప్పుడు కొరటాల శివకూ అలాంటి కిక్కే నెత్తిమీద ఎక్కిందా అనిపిస్తుంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు బాక్సాఫీసు దగ్గర దూసుకెళ్లిపోతుంది. దర్శకుడిగా ఆయనకూ మార్కులు పడ్డాయి.
ఆ మాత్రం చేత ఆ సినిమాలో లోపాలు లేకపోలేదు కదా. ఇదే విషయం కొరటాలని అడిగితే ఆయనకు కాస్త కోపం వచ్చింది. తలతిక్క సమాధానాలతో పాత్రికేయుల్ని కాసేపు తికమకపెట్టడానికి ట్రై చేశారాయన. ఆదివారం హైదరాబాద్ లో శ్రీమంతుడు ప్రెస్ మీట్ జరిగింది. కన్నకొడుకు ఎక్కడికెళ్లాడో, ఏం చేశాడో తెలుసుకోవాల్సిన బాధ్యత తండ్రికి ఉండదా? ఆ పాయింట్‌ని ఎందుకు మిస్ అయ్యారు అన్న ఓ పాత్రికేయుడి ప్రశ్నకు కాస్త వెటకారంగా, ఇంకాస్త ఘాటుగా సమాధానం ఇచ్చాడు కొరటాల. అలాంటి సీన్లన్నీ చేరిస్తే సినిమా తొమ్మిది గంటలవుతుందండీ. అంత అవసరమా?? అని ఎదురు ప్రశ్నించాడు. మరో ప్రశ్నకు రైతు కూలీలు ఊరు వదిలి వెళ్లకూడదు, వెళితే నేనైతే కొట్టి ఆపుతా.. అన్నాడు. ఈ సమాధానాలే చెబుతాయి ఈ దర్శకుడికి విజయాల కిక్కు ఎక్కేసిందని. అయితే మరో వైపు మహేష్ మాత్రం అన్నింటికీ నవ్వుతూ, చాలా బ్యాలెన్స్‌గా సమాధానాలు చెప్పుకొచ్చాడు. సూపర్ స్టార్లు ఊరకే అవుతారా. ఈ విషయం కొరటాల ఎప్పుడు తెలుసుకొంటాడో.?