కె. రాఘవేంద్రరావు సినిమాలో ఖుషీ కపూర్?
on Dec 1, 2020
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, అతిలోక సుందరి శ్రీదేవిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. తెలుగు, హిందీ భాషల్లో ఈ కాంబో పలు ఘనవిజయాలను చూసింది. కట్ చేస్తే.. ఇప్పుడు శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ తో జట్టుకట్టనున్నారట దర్శకేంద్రుడు. అయితే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కాదుగానీ, ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఖుషి నటించబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. 1996 సంక్రాంతి బ్లాక్ బస్టర్ పెళ్ళి సందడికి మోడ్రన్ వెర్షన్ గా పెళ్ళి సందD తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాటి పెళ్ళి సందడిలో శ్రీకాంత్ హీరోగా నటిస్తే.. లేటెస్ట్ వెర్షన్ లో ఆయన తనయుడు రోషన్ కథానాయకుడిగా దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు.. అప్పటి పెళ్ళి సందడిలాగే ఇందులోనూ ఇద్దరు నాయికలకు స్థానముందట. మెయిన్ లీడ్ గా ఖుషిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. సెకండ్ లీడ్ గా మాళవికా నాయర్ నటించబోతోందని సమాచారం. త్వరలోనే ఖుషి టాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కి నాటి పెళ్ళి సందడి స్వరకర్త కీరవాణినే బాణీలు అందించబోతున్నారు.