ఒకేసారి అరడజను సినిమాలు.. విజయం దక్కేనా!
on Jun 8, 2023
ప్రస్తుతం థియేటర్లలో బడా సినిమాలు లేవు. వచ్చే వారం జూన్ 16న 'ఆదిపురుష్' విడుదల కానుంది. అప్పటిదాకా చిన్న సినిమాలదే రాజ్యం. ఈ వారం సత్తా చాటడానికి చిన్న సినిమాలకు మంచి అవకాశముంది. అందుకేనేమో ఈ వారం ఒకేసారి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కలిపి అరడజనుకు పైగా విడుదలవుతున్నాయి. మరి వీటిలో విజయబావుటా ఎగరవేసే సినిమాలు ఎన్నో చూడాలి.
రేపు(జూన్ 9న) పలు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. అందులో ముందుగా 'టక్కర్' గురించి చెప్పుకోవాలి. అప్పట్లో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సంచలన విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్.. కాస్త విరామం తర్వాత 'టక్కర్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా విజయం పట్ల సిద్ధార్థ్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మరోవైపు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వంటి బడా బ్యానర్స్ నిర్మాణ భాగస్వాములు కావడంతో 'టక్కర్'పై సినీ ప్రియులలో ఆసక్తి నెలకొంది. పైగా టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో సిద్ధార్థ్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
రేపు విడుదలవుతున్న సినిమాలలో 'విమానం', 'ఇంటింటి రామాయణం' ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విమానం ఎక్కాలని కలలు కనే ఒక పిల్లాడి కథగా తెరకెక్కిన 'విమానం' ట్రైలర్ ఆకట్టుకుంది. సముద్రఖని, అనసూయ భరధ్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించడం, జీ స్టూడియోస్ నిర్మించిన సినిమా కావడంతో సినీ ప్రియుల దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది. ఇటీవల తెలంగాణ నేపథ్యంలో వస్తున్న గ్రామీణ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ కోవకి చెందినదే 'ఇంటింటి రామాయణం'. ఆహా నుంచి వస్తున్న మొదటి థియేట్రికల్ సినిమా ఇదే కావడం విశేషం. మొదట దీనిని ఓటీటీ కోసమనే చేశారు, కానీ అవుట్ పుట్ బాగా రావడంతో థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'అన్ స్టాపబుల్'. సన్నాఫ్ ఇండియా ఫేమ్ డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని, సినిమా చూసి నవ్వు రాకపోతే ఫోన్ చేసి అడగండని దర్శకుడు ఛాలెంజ్ చేయడం విశేషం. ఇక పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి 'యూనివర్సిటీ' అనే సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీటితో పాటు 'అనంత' అనే చిన్న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ద్వారా వచ్చే ప్రతి రూపాయిని ఒరిస్సా రైలు ప్రమాద బాధిత కుటుంబాలకి అందిస్తామని చిత్రం బృందం ప్రకటించింది.
రేపు విడుదలవుతున్న సినిమాలేవీ కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశంలేదు. మొదటి షోకి వచ్చే పాజిటివ్ టాక్ మీదే వీటి ఫలితం ఆధారపడి ఉంది. మరి వీటిలో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
