ENGLISH | TELUGU  

సీత సినిమా రివ్యూ

on May 24, 2019

 

నటీనటులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, తనికెళ్ల భరణి, అభినవ్ గోమటం, మన్నారా చోప్రా, బిత్తిరి సత్తి, 'రంగస్థలం' మహేష్, అభిమన్యు సింగ్ తదితరులు
నిర్మాణ సంస్థలు: ఏకే ఎంటర్టైన్మెంట్స్ 
పాటలు: లక్ష్మీ భూపాల, రామజోగయ్య శాస్త్రి, సురేంద్రకృష్ణ 
సినిమాటోగ్రఫీ: శీర్ష రాయ్ 
మాటలు: లక్ష్మీ భూపాల 
రచనా సహకారం: పరుచూరి బ్రదర్స్
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సమర్పణ: ఏ టీవీ  
నిర్మాత: రామబ్రహ్మం సుంకర 
కథ, కథనం, దర్శకత్వం: తేజ 
విడుదల తేదీ: మే 24, 2019

 

"సినిమా ఎలా వచ్చిందని అడిగితే నేను చెప్పలేను. నాకు జడ్జిమెంట్ లేదు. ఇప్పటికీ సూపరా? ఎవరేజా? నాకు తెలియదు. విడుదలైన తరవాత ప్రేక్షకులే చెప్పాలి. సినిమాలో అందరూ బాగా చేశారు. నేనే ఏవరేజీగా చేసినట్టున్నా" - 'సీత' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజ‌ స్పీచ్ ఈ విధంగా సాగింది. ఆయనకు సినిమా ఫలితం ముందే తెలిసిందా? లేదా సుమారు రెండేళ్లు ఒకే సినిమాపై వర్క్ చేయడంతో ఆయన తీసిన సినిమా ఆయనకే నచ్చలేదా? అసలు, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి. 


కథ:

హైద‌రాబాద్‌లో ఒక బస్తీ ఖాళీ చేయించి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టించడానికి ఎమ్మెల్యే బసవరాజు (సోనూ సూద్) సహాయం తీసుకుంటుంది సీత (కాజల్ అగర్వాల్). తనకు సాయం చేసినందుకు ప్రతిఫలంగా నెలరోజుల పాటు సహజీవనం చేస్తానని బసవరాజుకు అగ్రిమెంట్ రాసిస్తుంది. తీరా తన పని పూర్తయ్యాక... బసవరాజుకు సింపుల్‌గా సారీ చెబుతుంది. ఇచ్చిన మాట తప్పిన సీతను తన దారిలోకి తెచ్చుకోవాలని బసవరాజు శతవిధాలా ప్రయత్నిస్తాడు. బసవరాజు నుంచి సీతను రామ్ అలియాస్ రఘురామ్ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) ఎలా రక్షించాడు? అనేది మిగతా సినిమా. సీతకు దూరంగా రఘురామ్ భూటాన్‌లో ఎందుకు పెరిగాడు? సీత తండ్రి ఆస్తి అంతటినీ రఘురామ్ పేరు మీద ఎందుకు రాశాడు? అనేది అసలు కథలో ఉపకథలు!


ప్లస్ పాయింట్స్:

కాజల్ అగర్వాల్

సోనూ సూద్, తనికెళ్ళ భరణి మధ్య సన్నివేశాలు

ప్రత్యేక గీతంలో పాయల్ రాజ్‌పుత్‌


మైనస్ పాయింట్స్:

తేజ కథ, దర్శకత్వం

అనూప్ రూబెన్స్ సంగీతం

బిత్తిరి సత్తి వినోదం


నటీనటుల పనితీరు:

సీతగా కాజల్ అగర్వాల్ ప్రతి సన్నివేశంలోనూ జీవించింది. 'అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే అమ్మాయి'గా సన్నివేశానికి తగ్గట్టు నటించింది. పతాక సన్నివేశాల్లో భావోద్వేగభరిత నటనతో ఆకట్టుకుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరో పాత్రకు భిన్నంగా 'స్వాతిముత్యం'లో కమల్ హాసన్ చేసినటువంటి పాత్రలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి తనవంతు ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేదు. పోలీస్ స్టేషన్ ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ బాగా చేశాడు. అయితే... రఘురామ్ పాత్రలో సాయిశ్రీనివాస్ సెట్ కాలేదు. సోనూ సూద్ పాత్ర కొత్తగా ఉంది కానీ, అందులో అతడి నటన కొత్తగా లేదు. అయితే... సోనూ సూద్, తనికెళ్ళ భరణి మధ్య సన్నివేశాలు అద్భుతంగా రాయడంతో రెండు పాత్రలూ బాగున్నాయి. కాజల్ వెనుక కాసేపు మన్నారా చోప్రా కనిపించింది. ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. వినోదం పేరుతో పలు సినిమాల్లో సూపర్ హిట్ సాంగులను బిత్తిరి సత్తి చేత కూనీ చేయించారు. కోట శ్రీనివాసరావు ఒక సన్నివేశంలో మెరిశారు. కాజల్ కంపెనీలో ఉద్యోగిగా, ఆమె స్నేహితుడిగా అభినవ్ గోమటం ఉన్నంతలో బాగా చేశాడు. 'బుల్ రెడ్డి' పాటలో పాయల్ రాజ్ పుత్ అందాలు ఆరబోసింది.


విశ్లేషణ:

సీత కథ కాదిది, తేజ మెదడులో పురుడు పోసుకున్న మోడ్రన్ రామాయణం!  రాముడు తన కోసం వస్తాడని రామాయణంలో సీత ఎదురుచూసింది. "ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఎక్కడున్నారు? అవకాశం దొరికితే రాముడికి హ్యాండ్ ఇచ్చి, అవసరమైతే రాముణ్ణి వదిలించుకోవాలని చూసే అమ్మాయిలు ఉన్నారు" అని తేజ చెప్పాలని ప్రయత్నించారు. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండొచ్చు. అలాంటి అమ్మాయిగా కాజల్ పాత్ర చిత్రణ, అందులో ఆమె నటన రెండూ బాగున్నాయి. రావణాసురిడిగా సోనూ సూద్ పాత్ర చిత్రణ కూడా కుదిరింది. అయితే... రాముడి పాత్ర చిత్రణ మాత్రం బాగోలేదు. రాముడు మంచివాడు. కానీ, మతిలేని వాడు కాదు. స్వాతిముత్యం టైపు అసలు కాదు. ఇక్కడే కథలో తేజ తూకం తేడా కొట్టింది. మోడ్రన్ రాముణ్ణి స్వాతిముత్యంలా చూపిస్తూ చిత్రీకరించిన సన్నివేశాలు వినోదం పంచకపోగా... కథను అపహాస్యం చేశాయి. మధ్యలో హీరోయిజం అన్నట్టు జైలులో, కోర్టులో సన్నివేశాలు ఓవ‌ర్‌ది బోర్డు వెళ్ళాయి. పాత్రలను పక్కన పెట్టి కథగా, సినిమాగా చూస్తే చాలా లొసుగులు కనిపిస్తాయి. హీరో పదిన్నరకు ఎందుకు టీ తాగుతాడు? తాగిన తరవాత టాబ్లెట్స్ వేసుకోకపోతే అతడికి గుండెదడ ఎందుకు వస్తుంది? వంటి విషయాలకు క్లారిటీ లేదు. గాడి కనిపించే డ్రస్సులు వేసుకోవడానికి మన్నారా చోప్రాను తీసుకున్నారా? అనే అనుమానం కలుగుతుంది. 


తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తకథలు చేయాలని ప్రయత్నించి ఒక అడుగు ముందుకు వేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను అభినందించాలి. మంచిని పంచడానికి లోకంలో ఎవరో ఒకరు ఉండాలని చెప్పాలనుకున్న తేజ ఆలోచననూ అభినందించాలి. మంచి చెప్పే క్రమంలో ఆయన చెప్పిన కథ ఓ మెట్టు పైకి ఎక్కితే... మరో రెండు మూడు మెట్లు కిందకు దిగింది. ఇటు వినోదం, అటు సందేశం కరువైన సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే... కాజల్ అగర్వాల్ నటన, ప్రత్యేక గీతంలో పాయల్ అందాలు, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడికి ఉపశమనం ఇస్తాయి.   


రేటింగ్: 2.00

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.