Sirai Review: సిరై మూవీ రివ్యూ
on Jan 30, 2026

తారాగణం: విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్, అనిష్మ అనిల్ కుమార్, ఆనంద తంబిరాజ తదితరులు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
డీఓపీ: మాధేష్ మాణికం
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
దర్శకత్వం: సురేష్ రాజకుమారి
ఓటీటీ: జీ5
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించిన 25వ చిత్రం 'సిరై'. తమిళ్ లో మంచి విజయం సాధించిన ఈ మూవీ, ఓటీటీ వేదిక 'జీ5'లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. మరి ఈ క్రైమ్ డ్రామా ఎలా ఉందో తెలుసుకుందాం. (Sirai Movie Review)
కథ:
శ్రీనివాస్(విక్రమ్ ప్రభు) ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుంటాడు. ఒకసారి ఎస్కార్ట్ డ్యూటీలో ఉండగా ఓ ఖైదీ తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో.. అతడిని శ్రీనివాస్ తుపాకీతో కాలుస్తాడు. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తారు. అయితే ఆ విచారణ కొనసాగుతుండగానే.. అబ్దుల్(అక్షయ్ కుమార్) అనే మరో రిమాండ్ ఖైదీని కోర్టులో హాజరుపరిచే డ్యూటీ చేయాల్సి వస్తుంది. కానీ, అనూహ్యంగా అబ్దుల్ తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రీనివాస్ అండ్ టీమ్ అబ్దుల్‌ను పట్టుకోగలిగారా? ఇంతకీ అబ్దుల్ ఎవరు? అతను చేసిన నేరమేంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
తమిళ్ లో 'సిరై' అంటే 'జైలు' అని అర్థం. ఇందులో పోలీసుల జీవితాలను, అందునా కానిస్టేబుళ్ల జీవితాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. డ్యూటీలో పోలీసులకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రాణాలకు తెగించి ఎలా పోరాడతారు? ఆత్మ రక్షణ కోసం చేసే పనులు కూడా వారిని ఎలాంటి ఇబ్బందుల్లోకి నెడతాయి? ఇలా ప్రతి అంశాన్ని చక్కగా చూపించారు.
ఒక ఖైదీని బస్సులో తరలిస్తుండగా, అతను తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ తో సినిమాను ప్రారంభించిన తీరు ఆకట్టుకుంది. ప్రాణాలకు తెగించి పోరాడినా, ఆత్మ రక్షణ కోసమే తుపాకీ పేల్చినా.. ఉన్నతాధికారుల మద్దతు లేకపోవడం, కానిస్టేబుల్స్ విచారణ ఎదుర్కోవడం వంటి అంశాలు చూపించిన తీరు మెప్పించింది.
ఇక శ్రీనివాస్ తన టీంతో కలిసి అబ్దుల్ ని కోర్టులో హాజరు పరచడానికి తీసుకెళ్లే సీన్స్ తో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. అబ్దుల్ తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు మెప్పించాయి. ఇందులో పోలీసుల జీవితాలనే కాదు, ఒక మంచి ప్రేమ కథను కూడా చూపించాడు దర్శకుడు. అబ్దుల్ ప్రేమ కథ కట్టిపడేస్తుంది. ప్రేమకు మతాలు, జైలు గోడలు అడ్డు కాదని చెబుతూ.. ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను చూపించిన తీరు హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
దర్శకుడు ఎంచుకున్న కథాంశం బాగుంది. అందుకు తగ్గట్టుగానే ఆసక్తికర కథనాన్ని రాసుకున్నారు. కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా.. ఓవరాల్ గా సినిమా మెప్పించింది. ముఖ్యంగా నటీనటుల పర్ఫామెన్స్, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ సినిమాకి బలంగా నిలిచాయి.
ఫైనల్ గా..
పోలీసుల జీవితాలు, కోర్టుల్లో కేసుల విచారణలో జరుగుతున్న నిర్లక్ష్యం, మత వివక్ష, స్వచ్ఛమైన ప్రేమకథ.. ఇలా పలు అంశాల మేళవింపుతో తెరకెక్కిన 'సిరై' సినిమా ఆకట్టుకుంది. క్రైమ్ డ్రామా అయినప్పటికీ.. కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు.
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



