కన్నీరు తాగుతూ ఆనందాన్ని పంచిన శృంగార తార
on Apr 20, 2015
తెలుగు తెరపైకి ఎందరో ఐటెమ్ గాళ్స్ వచ్చారు వెళ్లారు...వస్తున్నారు కానీ.. ఎవ్వర్ గ్రీన్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది సిల్క్ స్మిత. జ్యోతిలక్ష్మి, జయమాలిని తర్వాత ఆ స్థాయిలో అవకాశాలు సద్వినియోగం చేసుకుని తారాజువ్వలా దూసుకుపోయింది. 2 దశాబ్దాల పాటూ తెలుగు తెరను ఏలింది. వెండితెర శృంగార తారగా నిలిచిపోయింది. కాలే కడుపుతో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టి....కుర్రాళ్ల కలల రాణిగా మారింది. పేరు, డబ్బు, హోదాలను ఆర్జించినా...నిలబెట్టుకోలేకపోయింది. కట్టు తప్పిన జీవితంతో బతుకును కల్లోలం చేసుకుంది. రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవాలనుకునే ప్రతీ అమ్మాయికీ ఓ పాఠంలా మిగిలింది . ఆమె లైఫ్ ఆద్యంతం విషాదమే..!
తెరపై వయ్యారాలొలకబోసిన సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఎలూరులో ఓ పేద కుటుంబంలో 1960 డిసెంబరు 2న జన్మించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలుగో తరగతితో చదువు ఆపేసింది. సినిమాలపై అమితాశక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1980లో వచ్చిన పండిచక్రమ్ తమిళ చిత్రం విజయలక్ష్మి పేరునే కాదు... ఆమె జీవనగమనాన్నే మార్చేసింది. ఆ సినిమాలో పాత్రపేరే ఆమె ఇంటిపేరు, ఒంటిపేరయింది. ఈ పేరే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దర్శకులకు విజయాన్నందించే ప్రత్యేక గీతమైంది. అగ్రహీరోల సినిమాలో తప్పనిసరి క్యారెక్టర్ అయింది.
కైపెక్కించే చూపుతో కుర్రకారుని తనవైపు తిప్పుకొనే ఆమెపై నిర్మాతల కన్నుపడింది. ఆఫర్లిస్తామంటూ వెంటపడ్డారు. స్కిన్ షోకి వెనక్కుతగ్గకపోవడం, మాటలో విరుపు... సిల్క్ పై మరింత కాన్సన్ ట్రేషన్ పెరిగింది. 2 దశాబ్దాలపాటూ హీరో ఎవరైనా స్మిత పాట ఉండాల్సిందే. ఆగిపోయిన సినిమాలకూ సిల్క్ పాట ప్రాణంపోసేది. ఆమె ఆటో.. పాటో లేకపోతే ప్రేక్షకులు థియోటర్లకు రారని డిస్టిబ్యూటర్లు...దర్శకనిర్మాతలపై ఒత్తిడి తెచ్చి సిల్క్ పాట పెట్టించేవారట.
ఓ దశలో హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ పారితోషికం. షూటింగ్ అంతా పూర్తైనా స్మిత పాటకోసం ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూసిన సందర్భాలెన్నో. స్మిత ధాటికి తట్టుకోలేకపోయిన కొందరు హీరోయిన్లు ఆమెలా ఎక్స్ పోజింగ్ కు సిద్ధమయ్యారంటే... శృంగార తారగా ఎంత సంచలనం సృష్టించిందో చెప్పొచ్చు. బొడ్డు కిందకు చీరకట్టినా, నడుము చుట్టూ కొంగు బిగించినా.. విల్లులా వొళ్లొంచినా.. సిల్క్ ది ఓ ప్రత్యేక శైలి. ఓ రకంగా ఆమెకి మాత్రమే సొంతమైన కళ. ఇప్పటికీ టీవీలో సిల్క్ పాటొస్తోందంటే ఏవో గిలిగింతలు. తెలుగు తెరకు బికినీ పరిచయం చేసిందే సిల్కేనంటే నమ్ముతారా?
స్మిత గొప్ప అందగత్తె కాదు. మనిషి చామనఛాయ. అయినా ఫొటోజెనిక్ ఫేస్ కావడం ఆమెకు కలిసొచ్చిన విషయం.ముఖ్యంగా మత్తెక్కించే కళ్లు ఆమెకి ఎస్సెట్. తెలుగుతోపాటూ తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో 450 చిత్రాల్లో నటించి అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించింది. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె శరీరాన్నే చూశారు కానీ ఆమెలో మంచి నటిని చూడలేదు. శరీరాన్ని ప్రదర్శించమన్నారే కానీ నటన కాదు. వైవిధ్య పాత్రల్లో నటించినా పరిశ్రమ మాత్రం.. సిల్క్ స్మితను ఓ శృంగార తారగానే గుర్తించింది. ఏవో ‘సీతాకోక చిలుక’, ‘వసంత కోకిల’ మినహా. తన కళ్ళముందే పనివాడి భార్యతో భర్త గదిలోకి వెళ్ళినప్పుడు- అదే సమయంలో వచ్చిన పనివాడు ముందు కన్నీళ్ళు దాచుకునే సన్నివేశంలో ఆమెని చూసి మనకు కన్నీళ్లాగవు. కానీ సిల్క్ స్మిత పేరు చెప్పగానే – ఆమె నీలి కళ్ళు తప్ప, కళ్ళ నీళ్ళు ఎందుకు గుర్తుకొస్తాయి. అసలామెకు పరిశ్రమ ఆ అవకాశం ఇవ్వనేలేదు.
90ల్లో స్మిత హవా కాస్త నెమ్మదించింది. స్టార్ హీరోయిన్స్ అంతా దేనికైనా రెఢీ అనడంతో ఆమె స్టార్ డమ్ తగ్గింది. నిచ్చెన ఎక్కుతున్నా అనుకుందే కానీ పక్కనే ఉన్న పాములను గుర్తించలేకపోయింది. నటనతో మెప్పించినా డాన్సర్ గా తప్ప నటిగా నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా అవకాశాలు సన్నగిల్లడం, కుదురుకోని జీవితం ఆమెను ఆటుపోట్లకు గురిచేసింది. ప్రియుడి సలహాతో నిర్మాణరంగలో దిగి అపార నష్టాలను ఆహ్వానించింది. తన పాత్రలు, ప్రవర్తన వల్ల సాటి నటుల అభిమానం సంపాదిచుకోలేకపోయిన సిల్క్ కష్టాల్లో ఒంటరిదైపోయింది. జీవితం ఎక్కడ ప్రారంభించిందో అక్కడికే చేరుకుంది. మానసికంగా కుంగిపోయింది.
కెరీర్ జోరుమీదున్నప్పుడు ప్రేమించానని వెంటపడిన వ్యక్తి కష్టాల్లో అండగా నిలబడలకేపోయాడు. ఒంటరి జీవితం వ్యసనాలవైపు నడిపించిది. నమ్మక ద్రోహం, అప్పుల భారం ఆత్మహత్య కు పురిగొల్పాయి. ఇండియన్ మార్లిన్ మాన్రో గా గుర్తింపు తెచ్చుకున్న స్మిత 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో తనఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకుంది. జీవితంలో ఎదురవుతున్న వరుస వైఫల్యాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె రాసిన నోట్ పోలీసులకు దొరికింది. ‘నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను. అతను నన్ను మోసం చేశాడు’ అని ఆమెకి ఐదేళ్ళు పరిచయంఉన్న ఒకరి గురించి లేఖలో ప్రస్తావించింది. అభిమానించే వాళ్లు లేక పడిన బాధ, తననుంచి లబ్ది పొందిన వారు సైతం ముఖం చాటేసిన తీరు. అనుభవించిన కష్టాలపై అంతరంగాన్నిఅందులో ఆవిష్కరించింది.
స్మితతో అప్పట్లో ఇద్దరు హీరోలు అత్యంత సన్నిహితంగా ఉండేవారట. వాళ్లిద్దరూ సూపర్ స్టార్లే. సిల్క్ జీవితం అర్థాంతంగా ముగియడానికి కారణం వీళ్లిద్దరే అనే ప్రచారం కూడా జరిగింది. ఆ ఇద్దర్లో ఒకరు ఇప్పటికీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఆమె మరణంపై మరెన్నో వార్తలు వాదనలు బయటకు వచ్చాయి. అవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. స్వయంకృతాపరాధంతో బతుకుని కల్లోలం చేసుకున్న సిల్క్ జీవితం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకునే ప్రతి తారకీ మననం చేసుకోవాల్సిన పాఠం.