గబ్బర్ ఉంటే హిట్టేనా?
on Mar 26, 2015
గబ్బర్ సింగ్ సినిమాతో ఐరెన్ లెగ్ అనే ముద్ర చెరిపేసుకుని గోల్డెన్ లెగ్ మారింది శ్రుతిహాసన్. అంతకు ముందు శ్రుతి అంటే వామ్మో అన్నవాళ్లంతా ఆ తర్వాత మాత్రం క్యూ కట్టేశారు. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. డైరెక్టర్ల అంచనాలకు మించి గ్లామర్, యాక్షన్, డాన్స్ లో ఇరగదీస్తోంది. అయితే టాలీవుడ్ లో కన్నా ముందే బాలీవుడ్ ప్రస్థానం ప్రారంభించింది. కొన్ని ప్రయోగాలూ చేసింది. కానీ ఫలితం దక్కలేదు. అయితే లేటెస్ట్ మూవీ 'గబ్బర్' పై మాత్రం చాలా ఆశలు పెట్టుకుందట. కారణం ఏంటా ఆరా తీస్తే టైటిల్ సెంటిమెంట్ అని చెబుతోంది. అదేనండి తెలుగులో 'గబ్బర్ సింగ్' తో ట్రాక్ లోకి వచ్చేసింది కదా. అక్కడ కూడా సేమ్ టైటిల్ 'గబ్బర్' తో కెరీర్ టర్న్ అవుతుందని ఆశపడుతోందట. తెలుగులో హిట్టైన 'ఠాగూర్' కి రీమేక్ గా 'గబ్బర్' తెరెక్కుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని క్రిష్ డీల్ చేయడంతో మరింత నమ్మకం పెట్టుకుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్షయ్ కుమార్ వందకోట్ల క్లబ్ లో ఉండడం ఓ కారణమైతే...ఇంతవరకూ క్రిష్ సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలందుకున్నాయి. దీంతో హిందీలోనూ 'గబ్బర్' తో లక్కు కలిసొస్తుందంటోంది. మరి నాజూకు సోయగం ఆశ ఏ మేరకు నెరవేరుతుందో చూద్దాం.