శ్రియా.. నీ పెద్ద మనసుకు సలాం
on Jul 22, 2017
కష్టాల్లో ఉన్న స్నేహితుడ్ని ఆర్థికంగా ఆదుకున్నంత మాత్రాన అదే గొప్ప స్నేహం కాదు. అసలు నిజమైన స్నేహం అంటే.. నేనున్నానన్న భరోసా. మిత్రుడిలో ఆత్మవిశ్వాసం అడుగంటకుండా చూడటం. దీనికి డబ్బుతో ప్రమేయం లేదు. ఈ విషయం శ్రియకు బాగా తెలిసినట్టుంది. అందుకే... కష్టాల్లో ఉన్న తన స్నేహితురాలికి తనదైన రీతిలో భరోసానిచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే... ఆమె అందించిన ఓదార్పు... ఆర్థికంగా కూడా ఆ స్నేహితురాలిని నిలబెట్టింది.
ఇంతకీ ఆ స్నేహితురాలు ఎవరు? అనేగా మీ డౌట్. తను ఎవరో కాదు... భూమిక. ఒకప్పుడు తెలుగుతెరను శాసించిన హీరోయిన్లలో భూమిక కూడా ఒకరు. స్టార్ హీరోలందరితో నటించిన క్రెడిట్ భూమిక సొంతం. అలాంటి భూమిక ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఆర్థికంగా దెబ్బతిని అప్పుల బాధలో ఉంది. మరి భూమికకు శ్రియ ఇచ్చిన భరోసా ఏంటి? అనుకుంటున్నారా? సరే వివరాల్లోకెళ్దాం.
భూమిక ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వనుంది. అందమైన అమ్మాలు తెలుగు తెరపై రాజ్యమేలుతున్న నేటి తరుణంలో.. భూమిక కూడా అందమైన అమ్మగా, అక్కగా రాణించడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. నాటి కథానాయికలందరూ తర్వాత కాలంలో అమ్మలు, అక్కలు అవ్వక తప్పదు. అయితే...భూమిక మాత్రం కాస్త తొందర గానే... కేరక్టర్ రోల్స్ లోకి దిగిపోతోంది. కారణం.. ఆమె ఆర్థిక బాధలే.
ఇదిలావుంటే... భూమిక భర్త భరత్ ఠాగూర్ యోగా గురువు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తను మంచి చిత్రకారుడు కూడా. తను వేసిన పెయింటింగ్ లతో ఈ మధ్య దుబాయ్ లో ఓ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశారు భూమక, ఠాగూర్ దంపతులు. ఆ కార్యక్రమానికి శ్రియ కూడా పిలిచారు. ఇటీవల శ్రియ దుబాయ్ లోని భరత్ ఠాగూర్ ఆర్ట్ గ్యాలరీని సందర్శించింది. శ్రియ రావడంతో... దుబాయ్ లో ఉన్న దక్షిణాది ప్రజలు పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే... శ్రియ వచ్చి ఓ పది నిమిషాలు కూర్చొని వెళ్లిపోకుండా.. తన స్నేహితురాలితో కలిసి ఓ రోజంతా ఆ ఆర్ట్ గ్యాలరీ లోనే గడింపిందట. దాంతో క్రౌడ్ పెరగడమే కాక, భరత్ ఠాగూర్ బొమ్మలు కూడా పెద్ద ఎత్తున అమ్ముడు పోయాయట.
ఒకరోజంతా తనకోసం శ్రియ అలా ఉండటంతో భూమిక చాలా ఎమోషన్ అయ్యారని సమాచారం. స్నేహితురాలి కోసం ఆ మాత్రం చేయడం పెద్ద గొప్పేం కాదు.. అని చిరునవ్వుతోనే ఓదార్చారట శ్రియ.. నిజంగా శ్రియ పెద్ద మనసుకు సలాం చేస్తే తప్పేం కాదు. ఏమంటారు?