'షేర్' రివ్యూ
on Oct 30, 2015
పటాస్ హిట్ కొట్టిన ఆనందం కల్యాణ్ రామ్‌కి ఎంతోకాలం నిలువలేదు. ఆ తరవాత నిర్మాతగా కిక్ 2 సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇబ్బందుల్లో పడ్డాడు. అయితే షేర్ హిట్ తో మళ్లీ ట్రాక్‌లోకి వద్దామనుకొన్నాడు. సేమ్ టూ సేమ్ పటాస్ లాంటి కమర్షియల్ కొలతలతో కుట్టేసిన చొక్కా.. షేర్. అందుకే... ఈ సినిమాపై కల్యాణ్ రామ్‌కి కాస్తో కూస్తో నమ్మకం పెరిగి ఉంటుంది. కమర్షియల్ సినిమాలు కాసిన్ని డబ్బులు దక్కించుకొంటున్న ఈ టైమ్‌లో షేర్ విడుదల కావడం, ఈ వారం ఈ సినిమాకి పోటీ లేకపోవడంతో.. షేర్‌పై కల్యాణ్ రామ్‌కి ఇంకా గురి కుదిరి ఉంటుంది. అయితే థియేటర్లో కూర్చున్న ఆడియన్‌కి ఈ లెక్కలు అసవరం. తన టికెట్టు రేటుకి గిట్టుబాటయ్యే వినోదం లభించిందా, లేదా? అనేదే ముఖ్యం. మరి ఈ విషయంలో షేర్ ఎంత వరకూ సక్సెస్ అయ్యింది? పటాస్ తో దక్కించుకొన్న హిట్.. షేర్ తో కొనసాగించాడా, లేదా?? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
గౌతమ్ (కల్యాణ్ రామ్) సరదాగా గడిపేసే కుర్రాడు. బీటెక్ చదివిన తన తమ్ముడికి ఛెస్ కోచ్‌గా ఉంటూ.. తండ్రి (రావు రమేష్)కి బిజినెస్ లోనూ సాయం చేస్తుంటాడు. ఓరోజు... రౌడీ షీటర్ పప్పుతో గౌతమ్ గొడవ పడతాడు. పప్పు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి తన తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాడు. `నువ్వు ఎవరినానై ప్రేమిస్తే.. ఆ అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకొంంటా` అంటూ చాలెంజ్ చేస్తాడు పప్పు. నందిని (సోనాల్ చౌహాన్)తో గౌతమ్‌కి పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. తాన పగ తీర్చుకోవడానికి పప్పుకి టైమ్ వస్తుంది. సరైన సమయం చూసి నందినిని లేపుకొస్తాడు. పప్పు కి ఇంటర్నేషన్ క్రిమినల్ దాదా (ముఖేష్ రుషి) అండదండలుంటాయి. పప్పు నిశ్చితార్థానికి హైదరాబాద్ వచ్చిన దాదా వారసుడు గబ్బర్ అనుకోకుండా హత్యకు గురవుతాడు. చిన్న కొడుకు చోటూ (షఫీ) కూడా ఇబ్బందుల్లో పడతాడు. ఇంతకీ గబ్బర్‌ని ఎవరు చంపారు? దాదాకీ, గౌతమ్‌కీ పాత పరిచయాలు ఉన్నాయా? పప్పుకి గౌతమ్ ఎలా బుద్ది చెప్పాడు? అన్నదే స్టోరీ.
కమర్షియల్ సినిమాలకు కథలతో పనిలేదని, ఫైట్ సీన్లకు లీడ్... కొన్ని పాటలూ, విలన్‌ని బకరా చేసే కాన్సెప్ట్ ఉంటే సరిపోతుందని ఈనాటి దర్శకుల నమ్మకం. ఆ లెక్క ప్రకారమే అల్లు కొన్న కథ.. షేర్. అయితే స్లాట్ మాత్రం కాస్త ఇంట్రస్టింగ్‌గానే ఉంది. కథలో ట్విస్టులకు చోటుంది. కథని ఇంట్రస్ట్‌గా నడిపితే.. షేర్ ఓకే అనిపించుకొనేది. కానీ... ఆ సామర్థ్యం దర్శకుడు మల్లికి లేకుండా పోయింది. పాట తరవాత ఫైటు, ఫైటు తరవాత పాట అంటూ.. ఫక్తు కమర్షియల్ సూత్రాల ప్రకారం సినిమాని నడిపేశాడు. ఏ సీన్‌లోనూ డెప్త్ లేదు. సీన్లకు సీన్లు గడిచిపోతున్నా.. ఆడియన్ కథకు కనెక్ట్ కాడు. ఎమోషన్ ని పండించే వీలున్నా.. దర్శకుడు అటువైపు దృష్టి పెట్టలేదు. దాంతో సినిమా సీరియస్ గా సాగుతున్నా.. ఆ ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుడికి కలగదు. సెకండాఫ్ అయితే.. దర్శకుడు ఏం చెప్పదలచుకొన్నాడో, సినిమాని ఎటువైపు డ్రైవ్ చేసుకొంటూ తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు. దాదాకీ, గౌతమ్‌కి ఉన్న పగ, ఆ ఫ్లాష్ బ్యాక్ కన్వెన్సింగ్‌గా చెప్పలేకపోయాడు మల్లి. దానికి తోడు.. `అరె.. భలే వుంది` అనుకొన్న సీన్ ఒక్కటీ లేదు. కామెడీ గ్యాంగ్ ఉన్నా.. వాళ్ల నుంచి కావల్సినంత వినోదం పిండుకోలేకపోయాడు. పటాస్ సినిమా హిట్టవ్వడానికి కారణం.. ఎంటర్‌టైన్ మెంట్. అయితే ఆ వినోదం ఈ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. బ్రహ్మానందం మరోసారి వెకిలి నవ్వులతో... చిరాకెత్తించాడు. అలీ బూతులతో రెచ్చిపోయాడు. దాంతో కామెడీ కాస్త.. ట్రాజడీగా మారింది. విలన్ డెన్ లో హీరో అడుగుపెట్టడం, వాడ్ని బకరా చేసి ఆడుకోవడం... ఎంతకాలం భరించాలి?? హీరో తమ్ముడ్ని విలన్ గ్యాంగ్ చంపడం, కొలకొత్తాలో విలన్ గ్యాంగ్ హీరో కోసం సీరియస్ గా వెతకడం.. ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి.
కల్యాణ్ రామ్ ఎనర్జీ లెవిల్స్ పటాస్ లో చూశాం. కథ, క్యారెక్టర్, డైలాగులు ఇచ్చిన ఎనర్జీ అది. అయితే.. ఈ సినిమాలో ఇవి మూడూ అంతంత మాత్రంగానే ఉన్నాయి.. దాంతో కల్యాణ్ రామ్ కూడా నీరసంగానే కనిపించాడు. కల్యాణ్ రామ్ మేకప్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే బాగుంటుందనిపిస్తుంది. ఫైట్ సీన్స్ లో మాత్రం ఆకట్టుకొన్నాడు. ఎమోషన్ సీన్స్‌లో నటించే ప్రయత్నం చేశాడు. వన్య మిశ్రా నటన, స్ర్కీన్ ప్రెజెన్స్ బాగోలేదని ఈ సినిమా లోంచి తప్పించారట. ఆ మాటకొస్తే సోనాల్ చౌహాన్ కూడా పెద్ద ఉద్ధరించిందేం లేదు. అందంగా కనిపిస్తే చాలు నటించాల్సిన అవసరం లేదనుకొందేమో..? రావురమేష్, రోహిణి, బ్రహ్మానందం, అలీ, ముఖేష్ రుషి... వీళ్లంతా తమ అనుభవాన్ని ప్రదర్శించే వీలు ఈ స్ర్కిప్టు కలిపించలేదు.
తమన్ రొడ్డకొట్టుడు బాదుడు ఎప్పుడు వదిలేస్తాడో.. అప్పుడుగానీ తమన్ పాటేంటో మన చెవికెక్కదు. ఆర్.ఆర్‌లోనూ అదే తీరాయె. కెమెరాపనితనం రిచ్‌గా ఉంది. కథలో కాస్త పదును ఉన్నా... దాన్ని తెరకెక్కించే విధానంలో దర్శకుడు బాగా తడబడ్డాడు. ఇది వరకు కల్యాణ్ రామ్‌కి రెండు ఫ్లాప్‌లు ఇచ్చాడు మల్లి. ఈసారైనా హిట్ కొడతాడన్న నమ్మకంతో కల్యాణ్ రామ్ మూడో అవకాశం ఇచ్చాడు. అయితే.. ఆ అవకాశాన్ని మల్లి మట్టిపాలు చేశాడనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని మెరుపులు తప్ప... సినిమాలో ఏం లేకుండాపోయింది.
రెండు మూడు కామెడీ బిట్లు, ఓ ఫైటు, ఇంట్రవెల్‌లో ట్విస్టు... సినిమా అంటే ఇదే కాదు. అంతకు మించి చాలా ఉండాలి. ఆ చాలా... ఈ సినిమాలో మిస్సయ్యింది. అందుకే షేర్.. బోర్ కొట్టించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
