టాలీవుడ్ కి కలసిరాని సీక్వెల్స్!
on May 12, 2015
హాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అయితే చాలు...దానికి కొనసాగింపుగా సినిమాలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ సీక్వెల్స్ సందడి సాగుతుంటోంది. మేమేం తక్కువ అంటూ టాలీవుడ్ లోనూ సీక్వెల్స్ తో సత్తాచాటాలనుకుంటారు. కానీ హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో సీక్వెల్స్ కి ఉన్నఆదరణ టాలీవుడ్ లో లభించదు. కారణమేదైనా....సీక్వెల్స్ ఫ్లాప్ అంతే.
టాలీవుడ్ సినిమాలకు సీక్వెల్స్ కలసిరావు. ఇది లేటెస్ట్ మాట కాదు. ఎప్పటినుంచో ఇదే జరుగుతోంది. ఆర్య-2 నుంచి మొదలై అవును-2 వరకు సేమ్ సీన్ రిపీట్ అయింది. కానీ మన స్టార్స్ కి మాత్రం సీక్వెల్స్ పై అస్సలు మొజుతగ్గడంలేదు. సినిమా హిట్ అయిన వెంటనే మరుక్షణమే....దానికి కొనసాగింపు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ కు పాజిటివ్ టాక్ రావడంతో దానికి సీక్వెల్ తీస్తానని నిర్మాత బండ్ల గణేశ్ ఆ మధ్య చెప్పాడు. కళ్యాణ్ రామ్ 'పటాస్' కు కూడా సీక్వెల్ తీస్తామంటున్నారు. అయితే ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఆ సినిమా సంగతి పక్కనపెడితే...విడుదలకు సిద్ధంగా ఉన్న-విడుదలై ఫెయిలైన సీక్వెల్స్ ఏంటో చూద్దాం.
వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2. పవన్ అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తోన్న ఈ ప్రాజెక్టు ఈ నెల్లోనే సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. దీనితో పాటు 'స్వామి రారా' కు సీక్వెల్ గా సెట్స్ పై ఉంది మోసగాళ్లకు మోసగాడు. మరోవైపు కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కూడా రణం-2తో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. రవితేజ- సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న కిక్-2 త్వరలోనే ఆడియన్స్ కు కిక్కించేందుకు సిద్ధమైంది. వీటిలో కిక్-2, రణం-2 కు మాత్రమే డైరెక్టర్స్ రిపీట్ అవుతుండగా.....గబ్బర్ సింగ్-2, మోసగాళ్లకు మోసగాడు వేరే దర్శకులు తెరెకెక్కిస్తున్నారు. డైరెక్టర్స్ మార్చాక అయినా సీక్వెల్స్ ఫెయిల్ అనే సెంటిమెంట్ కు చెక్ పెడదామనే ఆలోచనలో ఇలా చేశామని చెబుతున్నారు.
అయితే సీక్వెల్స్ కి దర్శకుడిని మార్చినా కానీ పెద్దగా ఫలితం ఉండదంటున్నారు. ఎందుకంటే గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ ను జయంత్ సి.పరాన్జీ తెరకెక్కించగా..... దాని సీక్వెల్ ను ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. చిరు- ప్రభుదేవా చేసిన గాంధీగిరి సీక్వెల్స్ తలరాతను మార్చలేకపోయింది. అలాగే గాయం- గాయం-2 సినిమాలకు కూడా వేర్వేరు దర్శకులు పని చేశారు. మనీ సీక్వెల్స్ లో మూడోదిగా వచ్చిన మనీ మనీ మోర్ మనీకి కూడా డైరెక్టర్ ను రిపీట్ చేయలేదు. దీంతో దర్శకుడు మారినా సీక్వెల్స్ తలరాత మారదనే సెంటిమెంట్ బలపడింది.
సేమ్ డైరెక్టర్ తెరకెక్కించిన సీక్వెల్స్ పరిశీలిస్తే....ఆర్యను సూపర్ హిట్ చేసిన సుకుమార్.. ఆర్య-2 విషయంలో ఆ మార్క్ చూపించలేకపోయాడు. చంద్రముఖితో లకలకలక అంటూ భయపెట్టిన పి.వాసు....నాగవల్లితో చతికిలపడ్డాడు. అవునుతో టెన్షన్ పెట్టిన రవిబాబు అవును-2తో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. సీక్వెల్స్ ను హిట్ చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు ఎంత ప్రయత్నించినా...సక్సెస్ మాత్రం దోబూచులాడుతూనే ఉంది. అయినప్పటికీ సీక్వెల్స్ పై క్రేజ్ తగ్గకపోవడం విశేషం.
అటు బాలీవుడ్ లో పరిశీలిస్తే....మాధవన్-కంగనా కాంబినేషన్ లో వచ్చిన తనూ వెడ్స్ మను కి కొనసాగింపుగా తనూ వెడ్స్ మనూ రిటర్స్న్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండేళ్లక్రితం వచ్చిన ఏబీసీడీ కి కూడా సీక్వెల్ ముస్తాబవుతోంది. కోలీవుడ్ లో కూడా ఈ తరహా చిత్రాలకు మంచి క్రేజ్ లభిస్తోంది. మాస్ హీరో సూర్య నటించిన సింగం, సింగం-2 తమిళనాట ఘన విజయం సాధించాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సిరీస్ లకు కూడా అక్కడ మంచి కలెక్షన్లు వసూలవుతున్నాయి. ప్రస్తుతం గంగ థియోటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
మరి విడుదలకు సిద్ధంగా ఉన్న సీక్వెల్స్ తో టాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవుతుందో....ట్రెండ్ సెట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.