మేనల్లుడు కోసం మామ భారీ స్కెచ్!
on Nov 3, 2017
చూడ్డానికి బావుంటాడు. చేత కూడా బానే ఉంటుంది. అండగా కొండంత మేనమామ ఉండనే ఉన్నాడు. ‘అన్నీ ఉన్నా... అల్లుడు నోట్లో శని’ అంటారు కదా! అలా తయారైంది అల్లుడుగారి పరిస్థితి. నిజానికి రెండు మూడు ఫ్లాపులొస్తే... ఆ హీరో ఉన్న బజారులో కూడా ఏ నిర్మాతా తిరగడు. అలాంటిది ఫ్లాపుల మీద ఫ్లాపుల ఇస్తున్నా ఇంకా నిర్మాతలు వస్తునే ఉన్నారు. ఇదంతా మేనమామ చలవ కాక మరేంటి,, చెప్మా? అయినా సరే.. మనోడికి మాత్రం హిట్ పడటం లేదు. అప్పుడెప్పుడో.. నాలుగేళ్ల కిందట ఓ హిట్ కొ్ట్టాడు. ఆ సినిమా తర్వాత రమారమీ ఓ పది సినిమాలు చేసుంటాడు. దాదాపు అన్నీ ఫట్లే. గజనీ మహ్మద్ దండయాత్ర చేసినట్టు నాలుగేళ్లుగా సినిమాలు తీసి బాక్సాఫీస్ మీదకు వదులుతూనే ఉన్నాడు అవి రాకెట్ వేగంలో వెళ్లి... తుస్ మంటున్నాయ్. అయినా సరే.. మనోడికి సినిమాలు మాత్రం కొదవుండదు. వెనుక గాడ్ ఫాదర్ ఉంటే ఇలాంటి సౌలభ్యాలు చాలా ఉంటాయ్ మరి.
ఇంతకీ ఈ అల్లుడు ఎవరూ? మామగారు ఎవరూ? ఏందీ గోల.. అనుకుంటున్నారా? ఇండస్ట్రీలో అల్లుడుకి అండగా నిలిచిన మామ అంటే ఎవరున్నారండీ.. ఒక్క చోటా కె.నాయుడు తప్పా?. అల్లుడేమో సందీప్ కిషన్. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ హిట్ తర్వాత వరుసగా పది ఫ్లాపులిచ్చాడు. అయితే.. మామ చోటా కె.నాయుడు.. ఈ దఫా భారీ స్కెచ్ వేశాడు. ఎలాగైనా సరే.. మేనల్లుడితో హిట్ కొట్టించాలనే పంతంమీద ఉన్నాడు. ఈ క్రమంలో వస్తున్న సినిమానే ‘c/o సూర్య’. సుశీందరన్ దర్శకుడు. అతను తీసిన ‘నా పేరు శివ’ తెలుగులో ఎంత హిట్టో తెలిసిందే. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. ఎందుకో ఈ సినిమాపై అందరికీ పాజిటీవ్ వైబ్రేషన్స్ ఉన్నాయ్. దానికి బలాన్నిస్తూ ఇటీవల విడుదలైన ట్రైలర్ నిజంగా కేక పుట్టస్తోంది.
ఈ దఫా హిట్ పక్కా అన్నట్టుగా ఉంది ట్రైలర్. ట్రైలర్స్ చూసి మోసపోకండి’.. అనే మాట నిజమే కానీ.. కొన్ని ట్రైలర్స్ చూస్తే మాత్రం.. సినిమా చూడకుండా ఉండలేం. ‘c/o సూర్య’ ట్రైలర్ చూస్తే... సేమ్ ఫీలింగ్. ట్రైలర్లో కనిపించిన పాత్రలన్నీ.. సమకాలీన సమాజంలో మనకు బాగా పరిచయమైన పాత్రల్లాగే ఉన్నాయ్. హీరో కేరక్టరైజేషన్ అయితే.. నేటి యూత్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. అన్నకు సొంత చెల్లెలే డబ్బులు వడ్డీకివ్వడంం.. సరిగ్గా చదవడం లేదని అమ్మ తిట్టడం.. ఫ్రెండ్ ఎంత వెధవైనా.. ‘మా వాడు చాలా గొప్ప’ అని చెప్పుకునే మరో ఫ్రెండ్. ఫ్రెండ్ కోసం ప్రాణాలను సైతం అడ్డపెట్టే మరో స్నేహితుడు... ‘ఫోన్ ఎత్తకపోతే.. ఇంటికొచ్చి కొడతా’ అని బెదిరించే ప్రియురాలు.. ఇవన్నీచూస్తుంటే సినిమాను ఇమిడియట్ చూసేయాలనిపిస్తుంది. ‘ముత్తు’లో రజనీకాంత్ డైలాగ్ ‘యచ్చచ్చ యచ్చచ్చ.. గచ్చచ్చ గచ్చచ్చ’ సౌండ్ ని నేపథ్య సంగీతంలా వాడుకోవడం వైరైటీగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే.. హీరో సందీప్ కిషన్ కి హిట్... కథానాయిక మెహ్రిన్ కి హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అయ్యేట్టు కనిపిస్తుంది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.