చిరంజీవి ‘సైరా’తో హృతిక్ ‘వార్’
on Aug 13, 2019
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు నేలపై స్వాతంత్య్ర సమర శంఖం పూరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకు పోటీగా ఏదీ రావడం లేదు. కానీ, ఓ హిందీ సినిమా వస్తోంది. అదే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘వార్’. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన యుద్ధ చిత్రం ‘సైరా’ అయితే... ఈ కాలం నేపథ్యంలో తెరకెక్కిన మోడ్రన్ యాక్షన్ ఫిల్మ్ ‘వార్’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్టు హృతిక్ రోషన్ టీమ్ ప్రకటించింది. తెలుగులోనూ ‘వార్’ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసింది. అటు మెగాస్టార్ టీమ్ హిందీలో ‘సైరా’ను విడుదల చేసే ఆలోచనల్లో ఉంది. అక్కడా అక్టోబర్ 2న విడుదల చేస్తారా? లేదా తర్వాత విడుదల చేస్తారా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ హిందీలో అదే తేదీన విడుదల చేసినా ‘సైరా’కు ‘వార్’ అడ్డంకి కాదు. ఎందుకంటే... ‘సైరా’కు సరిపడా స్ర్కీన్లు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఓపెనింగ్స్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో మాత్రం హృతిక్, టైగర్ ‘వార్’కి మినిమమ్ ఓపెనింగ్స్ వస్తాయా? అనేది సందేహమే. చిరంజీవి సినిమా ముందు హిందీ సినిమాకు థియేటర్లు లభించడమే కష్టం. ఇక, ఓపెనింగ్స్ ఎక్కడ వస్తాయి?