అల్లు అరవింద్, దిల్ రాజులకు షాక్ ఇచ్చిన పిల్ల..
on Nov 25, 2014
సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా.. పిల్లా నువ్వు లేని జీవితం. కొత్త హీరో అయినా, మెగా బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఈ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తొలి పది రోజుల్లో దాదాపుగా రూ.10 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజుల్లో అన్నీ మూడు రోజుల సినిమాలే. సినిమా ఎంత బాగున్నా.. పదిరోజులకు మించి రన్ అవ్వడం కష్టం. ఆలెక్కన పిల్లా నువ్వు లేని జీవితం మహా అయితే మరో రెండు కోట్లు వసూలు చేయొచ్చు. శాటిలైట్‌తో కలిపి ఈసినిమాకి రూ.14 కోట్లు వస్తాయేమో..?! ఆ లెక్కన చూసుకొన్నా ఈ సినిమాకి నష్టాలు తప్పవంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఎందుకంటే ఈ సినిమాకి దాదాపుగా రూ.18 కోట్ల బడ్జెట్ అయ్యిందట. శ్రీహరికే మూడు కోట్లు ఇచ్చారట. ఆయన మరణంతో మళ్లీ సినిమాలో కొంత భాగం రీషూట్ చేయాల్సివచ్చింది. దానికితోడు జగపతిబాబుని రీప్లేస్ చేయడానికి దాదాపు రూ.కోటి రూపాయలు వదిలాయి. ఆర్టిస్టులకు పేమెంట్స్ డబుల్ అయ్యాయి. అందుకే ఈ సినిమాకి పాజిటీవ్ టాక్ వచ్చినా.. నష్టాలు తప్పలేదని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. దిల్‌రాజు, అల్లు అరవింద్ ఇద్దరూ ప్లానింగ్‌లో దిట్టే. కానీ అలాంటి వాళ్లకూ సినిమా షాక్ ఇవ్వగలదని ఈ పిల్ల నిరూపించింది. ఏం చేస్తాం... టైమ్ బ్యాడ్ అంతే.