దర్శకధీరుడు రాజమౌళి ప్రయాణం.. సీరియల్ డైరెక్టర్ నుంచి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా!
on Oct 9, 2023
ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ అన్నా, అపజయమెరుగని దర్శకుడు అన్నా ముందుగా గుర్తుకొచ్చే పేరు దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడైన రాజమౌళి.. మొదట అసిస్టెంట్ రైటర్ గా, సీరియల్ డైరెక్టర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి.. నేడు ఇండియాలోనే టాప్ మూవీ డైరెక్టర్ గా ఎదిగారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుని రాజమౌళి గురువుగా భావిస్తారు. రాఘవేంద్రరావు నిర్మించిన 'శాంతి నివాసం' అనే సీరియల్ కి దర్శకుడిగా వ్యవహరించారు రాజమౌళి. ఆ సీరియల్ సమయంలో ఆయన కనబరిచిన ప్రతిభే.. ఆయనకు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'స్టూడెంట్ నెం.1' సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. 2001, సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించినప్పటికీ రాజమౌళికి రావాల్సినంత పేరు రాలేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో రాజమౌళికి అంతగా క్రెడిట్ దక్కలేదు. దీంతో రెండో సినిమా అవకాశం కోసం ఆయన కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన రెండో సినిమా 'సింహాద్రి'ని కూడా ఎన్టీఆర్ తోనే చేసే అవకాశాన్ని దక్కించుకున్న రాజమౌళి.. ఆ సినిమాతో తానేంటో నిరూపించుకొన్నారు. 2003, జూలై 9న విడుదలైన సింహాద్రి సినిమా ఎన్నో సంచలనాలు సృష్టించింది. 50కి పైగా కేంద్రాల్లో 175 రోజులు ఆడి, ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదంటే సింహాద్రి ఏస్థాయి ప్రభంజనాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.
సింహాద్రి తర్వాత ఇక రాజమౌళి వెనుతిరిగి చూసుకోలేదు. వరుస భారీ విజయాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగారు. తెలుగు ప్రేక్షకులకు రగ్బీ గేమ్ అంటేనే అవగాహన లేదు. అలాంటిది ఆ ఆట నేపథ్యంలో 'సై' అనే సినిమా తీసి హిట్ కొట్టిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఇక ప్రభాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన సినిమా అంటే 'ఛత్రపతి' అని చెప్పొచ్చు. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, మదర్ సెంటిమెంట్ తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక రవితేజలోని ప్రతిభని పూర్తిస్థాయిలో వాడుకున్న సినిమా అంటే 'విక్రమార్కుడు' అని చెప్పొచ్చు. అత్తిలి సత్తిబాబుగా, విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజను రాజమౌళి చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'సింహాద్రి' తర్వాత సరైన విజయాల్లేక, బాడీ మీద సరైన శ్రద్ధ చూపక ట్రోల్స్ కి గురైన ఎన్టీఆర్ ను 'యమదొంగ'లో సరికొత్తగా చూపించి సర్ ప్రైజ్ చేశారు రాజమౌళి. యమలోకం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాతోనే భారీ సినిమాలకు పునాది వేశారు రాజమౌళి.
చిరంజీవి వారసుడిగా పరిచయమైన రామ్ చరణ్ అప్పటికి 'చిరుత' సినిమా మాత్రమే చేసి ఉన్నాడు. అలాంటిది రామ్ చరణ్ తో పునర్జన్మల నేపథ్యంలో 'మగధీర' వంటి భారీ సినిమాని తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. తెలుగులో రూ.50 కోట్లు, రూ.60 కోట్లు, రూ.70 కోట్ల షేర్ మార్క్ లను అందుకున్న మొదటి సినిమా 'మగధీర'నే కావడం విశేషం. ఇందులో కాలభైరవ వంద మందితో తలపడే ఒక్క సన్నివేశం చాలు రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఏంటో చెప్పడానికి. హీరోలు, స్టార్ హీరోలతో మాత్రమే కాదు.. కమెడియన్ తో కూడా సినిమా తీసి హిట్ కొట్టగలనని 'మర్యాద రామన్న'తో నిరూపించారు రాజమౌళి. ఆ మాటకొస్తే కమెడియన్ కూడా అవసరంలేదు.. చిన్న 'ఈగ'తోనే సంచలనాలు సృష్టించగలనని నిరూపించారు. ఆయన డైరెక్ట్ చేసిన ఈగ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు అందుకుంది.
ఇక ప్రభాస్ తో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి 'బాహుబలి' సినిమాని ప్రకటించినప్పుడు ఎందరో పెదవి విరిచారు. తెలుగు సినిమా మార్కెట్టే వంద కోట్లు లేదు.. అలాంటిది వంద కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమా ఏంటని వెటకారం చేసినవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ తన సినిమా రిజల్ట్ తోనే సమాధానం చెప్పారు రాజమౌళి. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-1 వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక 2017 ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి-2 అయితే కలలో కూడా ఊహించని విధంగా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా, తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. ఇక 'ఆర్ఆర్ఆర్'తో హాలీవుడ్ ప్రముఖులు సైతం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు రాజమౌళి. అంతేకాదు తెలుగు సినిమాకి, ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాకే అందని ద్రాక్ష లాంటి ఆస్కార్ ని తెచ్చిన ధీరుడు కూడా రాజమౌళినే.
రాజమౌళి సినిమా అంటే భారీతనంతో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందుకే ఆయన సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అవుతారు. పైగా ప్రతి సన్నివేశాన్ని ఆయన ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దుతారు. అందుకే ఆయనను పని రాక్షసుడు అని, జక్కన్న అని అంటుంటారు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ భారీ అడ్వెంచర్ ఫిల్మ్ ని రూపొందించే సన్నాహాల్లో ఉన్నారు. ఈ మూవీతో తెలుగు సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచుతారు అనడంలో సందేహం లేదు. ముందు ముందు ఆయన మరిన్ని ఉన్నతశిఖరాలను చేరాలని, ఆయనతో పాటు తెలుగు సినిమాని కూడా ఉన్నత శిఖరాలకు చేర్చాలని కోరుకుంటూ.. జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు.
(అక్టోబరు 10న రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)