శ్రియ స్థానంలో రెజీనా?
on Jul 26, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకధీరుడు రాజమౌళి ఫస్ట్ కాంబినేషన్ మూవీ `ఛత్రపతి`(2005).. అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా.. ప్రభాస్ కి మాస్ ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ ని తీసుకువచ్చిందీ యాక్షన్ ఎంటర్టైనర్. కట్ చేస్తే.. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ బాలీవుడ్ బాట పడుతున్న సంగతి తెలిసిందే.
యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా హిందీనాట రీమేక్ కానుంది. అటు సాయిశ్రీనివాస్ కి, ఇటు వినాయక్ కి ఇదే మొదటి బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. కాగా, మాతృకలో శ్రియ పోషించిన నాయిక పాత్రను హిందీ వెర్షన్ లో ఎవరు చేస్తారనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఆలియా భట్ మొదలుకుని సాయిపల్లవి వరకు పలువురు ప్రముఖ కథానాయికల పేర్లు ఈ రీమేక్ కి వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. చెన్నై పొన్ను రెజీనా `ఛత్రపతి` రీమేక్ లో హీరోయిన్ గా నటించబోతోందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రెజీనా `ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా` (2019) అనే హిందీ చిత్రంలో సోనమ్ కపూర్ తో కలిసి నటించింది. మళ్ళీ మూడేళ్ళ తరువాత ఇప్పుడు `ఛత్రపతి` రీమేక్ లో తన పేరు వినిపించడం విశేషం.