రణరంగం మూవీ రివ్యూ
on Aug 15, 2019
చిత్రం: రణరంగం
తారాగణం: శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్, రాజా, మురళీ శర్మ, అజయ్, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, ఆదర్శ్, ప్రవీణ్
సంభాషణలు: అర్జున్-కార్తీక్
సంగీతం: ప్రశాంత్ పిళ్లై
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి
దర్శకత్వం: సుధీర్ వర్మ
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
బేనర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 15 ఆగస్ట్ 2019
శర్వానంద్ ఏదైనా సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా సబ్జెక్ట్‌లో ఏదో ఒక యూనిక్‌నెస్, కథలో ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుందనేది ప్రేక్షకుల నమ్మకం. 'పడి పడి లేచే మనసు'తో అధిక శాతం ప్రేక్షకుల్ని అసంతృప్తికి గురిచేసిన శర్వా.. ఈసారి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడనీ, రెండు దశల్లో అతడి కేరెక్టర్ ఉంటుందనీ ప్రమోషన్స్ సందర్భంగా చెబుతూ వచ్చారు. మిస్టరీ థ్రిల్లర్స్ తీయడంలో నిపుణుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ, గ్యాంగ్‌స్టర్‌గా శర్వాని ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి వ్యక్తమైన నేపథ్యంలో వచ్చిన 'రణరంగం' అంచనాలకు తగ్గట్లుగా ఉందా?
కథ:
ప్రస్తుత కాలం నుంచి మొదలై 1990ల కాలానికి తీసుకెళ్లే కథ 'రణరంగం'. విశాఖపట్నంలో సినిమా హాళ్ల దగ్గర తన స్నేహ బృందంతో కలిసి బ్లాకులో టికెట్లు అమ్ముకొని జీవనం గడిపే దేవా (శర్వానంద్) అనే యవకుడు ఒక మాఫియా సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా ఎదిగాడనేది ఇందులోని ప్రధానాంశం. కూతురితో స్పెయిన్‌లో ఉండే దేవాతో అజయ్ (అజయ్) అనే వ్యాపారవేత్త కలుస్తాడు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కోసం ఐదు ఊళ్లను ఖాళీ చేయిస్తే ఎన్ని కోట్లయినా ఇస్తానని దేవాతో అతను బేరం పెడతాడు. ఆ ఐదు ఊళ్ల మనుషులు దేవా వల్ల ప్రయోజనం పొందినవాళ్లు. అజయ్‌తో డీల్‌కు దేవా అంగీకరించడు. ఆ తర్వాత ఏం జరిగింది? దేవా జీవితంలోని గతం తాలూకు జ్ఞాపకాలేంటి? గతం నీడలా వెన్నాడుతుంటే, ప్రస్తుతంలో అతడెలాంటి ఘటనలను, పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
అనాలిసిస్:
గ్యాంగ్‌స్టర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. మాఫియా నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఏదైనా కొత్తగా చెబితే తప్ప ప్రేక్షకుల్ని కన్విన్స్ చెయ్యలేం. అయినా పాత కథతోనే డైరెక్టర్ సుధీర్ వర్మ 'రణరంగం'ను ప్రెజెంట్ చేశాడు. కాకపోతే స్క్రీన్‌ప్లే విధానాన్ని మార్చాడు. ప్రతి పది నిమిషాలకోసారి కథ.. ప్రస్తుతం నుంచి గతానికీ, గతం నుంచి ప్రస్తుతానికీ వచ్చేట్లు కథనాన్ని రూపొందించడం సినిమాని బలహీనంగా మార్చేసింది. కథతో ప్రేక్షకుడు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడానికి ఈ కథనమే అడ్డుగోడగా నిల్చింది.
దేవా తలపుల్లో కథ ప్రస్తుతం నుంచి గతానికి వెళ్తుంది. ఆ గతం కాస్తంత ఆసక్తికరంగానే అనిపిస్తున్నంతలో.. ఏదో కొంప మునిగిపోయినట్లు కథ ప్రస్తుతానికి రావడం అసంతృప్తి కలిగిస్తుంది. కథలో లింక్ తెగిన అనుభూతి కలుగుతుంది. సినిమా ఆద్యంతమూ ఇదే ధోరణి. బ్లాకులో టికెట్లు అమ్మే దేవా తొలిచూపులోనే గీత (కల్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో పడి, ఆమె వెంట తిరిగే సన్నివేశాలు సరదాగా ఉంటాయి. అతడు చేసే పనేమిటో తెలిసినా కూడా ఆమె సైతం క్రమేణా అతడికి మనసిస్తుంది. ఆ తర్వాత రెగ్యులర్ డాన్ సినిమాల్లో ఉండే తరహాలోనే సన్నివేశాల్ని క్రియేట్ చేశాడు దర్శకుడు. దేవా, ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ) మధ్య ఆధిపత్య పోరు కారణంగా కొన్ని ప్రాణాలు పోతాయి. సింహాచలం తన మనిషిని ఒకర్ని చంపితే, అతడి మనుషుల్ని నలుగుర్ని చంపి ప్రతీకారం తీర్చుకొనే అతి మామూలు డాన్‌లా దేవా కేరెక్టర్‌ని మలిచాడు దర్శకుడు. గతంలో అయినా, ప్రస్తుతంలో అయినా అటూ ఇటూ ఆ హింసాకాండ కొనసాగుతూ వస్తుంది. కాకపోతే క్లైమాక్స్‌లో ఒక 'ట్విస్ట్'లాంటిది పెట్టాడు డైరెక్టర్. అది సినిమాకి బలమవుతుందనుకున్నాడేమో! ప్చ్.. ఆ ట్విస్ట్ ఏమాత్రం సినిమాని కాపాడ్డానికి పనికి రాలేదు. అసలు సబ్జెక్ట్‌లో సత్తా ఉండాలిగా.. క్లైమాక్స్ దాకా సన్నివేశాల్ని మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేస్తుంటాం. మనం అనుకున్నట్లే సన్నివేశాలు వస్తుంటే చికాకు కలుగుతుంది. ఆ సన్నివేశాల్ని కల్పించిన తీరు విసుగు పుట్టిస్తుంది. బాంబ్ బ్లాస్టులో గీత చనిపోతే, 'అయ్యో పాపం' అనిపించాల్సింది పోయి, 'ఇలా అవుతుందని మనం ఊహించిందేగా' అనుకుంటామంటే.. డైరెక్షన్ ఎంత వీక్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టెక్నికల్‌గా మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఉత్తమ స్థాయిలో ఉన్నాయి. రాంగ్ స్క్రీన్‌ప్లే కారణంగా ఎడిటర్ నవీన్ నూలి ఏమీ చెయ్యలేకపోయాడు. డాన్ సినిమాల్లో హీరోకి ఎక్కువగా దేవా అనే పేరు ఎందుకుంటుందో తెలీదు. దేవా పాత్ర ఆసక్తికరంగా మొదలై, సాధారణ స్థాయిలో కొనసాగి, అనాసక్తకర స్థాయికి చేరుకుంటుంది. అంటే ఆరోహణ (పురోగమనం) నుంచి కథనం అవరోహణం (తిరోగమనం)లోకి మారడం సినిమాకి శాపంగా మారింది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం క్వాలిటీగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
శర్వానంద్, కల్యాణి ప్రియదర్శన్ నటన
సినిమాటోగ్రఫీ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
మూస గ్యాంగ్‌స్టర్ స్టోరీ
వీక్ స్క్రీన్‌ప్లే
విసుగు తెప్పించే ప్రధాన పాత్రల చిత్రణ
ఎమోషన్స్ పండించలేకపోవడం
అత్యంత బలహీనమైన క్లైమాక్స్
నటీనటుల అభినయం:
శర్వానంద్ మెథడ్ యాక్టర్ అనే విషయం తెలిసిందే. కొలత కొలిచినట్లు సందర్భానికి తగ్గట్లుగా తెరపై ప్రవర్తిస్తాడు. దేవా పాత్రలో అతడు అదే తరహాలో సునాయాసంగా నటించాడు. ఒక అల్లరిచిల్లర యువకుడుగా మొదలై, గంభీరంగా కనిపించే శక్తిమంతమైన మాఫియా డాన్‌గా ఎదిగే క్రమాన్ని అతడు ప్రతిభావంతంగా చూపించాడు. కానీ పాత్ర చిత్రణలో కొత్తదనమేమీ కనిపించకపోవడం వల్ల అతడెంతటి అభినయ సామర్థ్యాన్ని ప్రదర్శించినా ఏం లాభం! గీత పాత్రలో కల్యాణి ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలోని ముగ్ధత్వాన్నీ, చిలిపిదనాన్నీ చక్కగా ప్రదర్శించింది. మిగతా వాళ్లలో నటుడిగా ఆకట్టుకొనేది సింహాచలం పాత్ర చేసిన మురళీ శర్మ. భిన్నమైనా బాడీ లాంగ్వేజ్‌తో విలన్‌గా ఆకట్టుకున్నాడు. మిగతావాళ్లకు నటించేందుకు పెద్దగా అవకాశం రాలేదు. డాక్టర్‌గా కాజల్ అగర్వాల్ కనిపిస్తుందంతే. దేవా ఇంటి నౌకరుగా ప్రవీణ్ నవ్వించడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సూరి కేరెక్టర్‌లో రాజా (సీతారామశాస్త్రి కుమారుడు) ఎప్పట్లా మెప్పించాడు. అజయ్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, ఆదర్శ్ వంటివాళ్లు తమ పరిధుల మేరకు నటించారు.
తెలుగుఒన్ పెర్‌స్పెక్టివ్:
'రణరంగం' లాంటి ఆసక్తికర టైటిల్ పెట్టినా, దానికి న్యాయం చెయ్యలేక 'దారుణ'రంగంలా మిగిలిపోయిన సినిమా ఇది. ఈ సినిమా ఎవరికీ మేలు చేకూర్చే అవకాశాలు లేవు. చూసేవాళ్ల సంగతి ఇక చెప్పేదేముంది!
రేటింగ్: 2.25/5
- యజ్ఞమూర్తి