ఒకే ఒక్కడు.. రామానాయుడు!
on Jun 6, 2015
సినిమా... సినిమా.... సినిమా..
రామానాయుడుకి సినిమా తప్ప మరేం తెలీదు.
ఆయన ఆశ సినిమా, ఆలోచన సినిమా, ఆశయం సినిమా...
అందుకే మూవీమొఘల్‌గా ఎనలేని ఖ్యాతి సంపాదించారు. నిర్మాత అంటే క్యాషియర్ అనుకొనే ఈ రోజుల్లో, సినిమా నిర్మాణం అంటే పెట్టుబడికీ రాబడికీ మధ్య జరిగే వ్యాపారం అనుకొనే ఈ రంగుల ప్రపంచంలో - రామానాయుడి జీవితం, ఆయన పయనం, ఆయన సాధించిన విజయం ఈనాటి నిర్మాతలకు పెదబాల శిక్ష. సినిమా పరిశ్రమకు శ్రీరామరాక్ష!!
జీవితంలో గెలుపు - ఓటమి రెండూ ఉంటాయి.
ఓటమికి భయపడిపోతే.. గెలుపు అందుకొనే అర్హత లేదు..
- ఇదీ రామానాయుడు నమ్మిన సిద్ధాంతం. ఓటమి వెంబడించినప్పుడు - సినిమాలు వదిలేయడం తప్ప మరో మార్గం లేనప్పుడు.. ఆయన ఎదురొడ్డి నిలబడ్డారు.. అద్భుతమైన విజయాలు సాధించారు.
మనం అనుకొన్నట్టు..ఆయనది పూల ప్రయాణం కాదు. ఆయనా డక్కాముక్కీలు తిన్నారు. ఆమాటకొస్తే.. ఇప్పటి నిర్మాతలకంటే కొన్ని ఎక్కువే తిన్నారు. రామానాయుడుకి ఎదురైన సవాళ్లు మరే నిర్మాతా ఎదుర్కోలేదేమో..!
రాముడూ - భీముడూ సూపర్ హిట్టయ్యింది. అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకొంది. ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
అయితే రాముడు భీముడు ముందున్న పరిస్థితి వేరు. అప్పటికే సహనిర్మాతగా సినిమా చేసి చేతులు కాల్చుకొన్నారు నాయుడు గారు. పార్టనర్ షిప్‌పై సినిమాలు చేద్దామంటే స్నేహితులెవ్వరూ కనిపించలేదు. సోలోగా సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించి, ఏకంగా అప్పటి స్టార్ హీరో.. ఎవ్వరికీ అంతనంత ఎత్తున్న ఉన్న హీరో.. ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాలి అనుకోవడం కనీవినీ ఎరుగని ఓ సాహసం. 'రాముడు భీముడు' ఆడితే పరిశ్రమలో ఉందాం. లేదంటే కారంచేడు వెళ్లిపోయి వ్యవసాయం చేసుకొందాం...అని డిసైడై... చావో రేవో తేల్చుకొందామనే రంగంలోకి దిగారు.
ఫలితం... అద్భుత విజయం. ఈసినిమాతోనే రామానాయుడు పేరు చిత్రసీమలో మార్మోగిపోయింది. సురేష్ ప్రొడక్షన్స్ నిలబడిపోయింది.
సరిగ్గా ఇలాంటి సవాలే... ప్రేమ్‌నగర్ ముందూ ఎదురైంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన అంతకు ముందు సినిమాల్నీ ఫ్లాప్ అయ్యాయి. ఓ హిట్టుపడకపోతే.. ఆ సంస్థ మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. అలాంటప్పుడు ఎవరైనా సేఫ్ గేమ్ ఆడతారు. తక్కువ బడ్జెట్‌లో ఓ కమర్షియల్ సినిమా చేసి గట్టెక్కెద్దాం అని ప్లాన్ వేస్తారు. కానీ అలా అనుకొంటే ఆయన రామానాయుడు ఎందుకు అవుతారు? మూవీ మొఘల్‌గా ఎలా నిలబడతారు? భారీ బడ్జెట్‌తో, సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకొన్న ఏఎన్నార్, వాణిశ్రీలతో ప్రేమ్‌నగర్ తీశారు. అప్పట్లో ఆ సినిమా బడ్జెట్ రూ.20 లక్షలపైమాటే. రూ.20 లక్షలంటే.. అప్పట్లో అదే భారీ బడ్జెట్ సినిమా. కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత భారీ సెట్టింగుల మధ్య ఈ సినిమా తెరకెక్కించారు రామానాయుడు. ఆ సెట్టింగులు చూసి ''ఏంటీ రామానాయుడి మతిపోయిందా? ఇంత డబ్బు తగలేస్తున్నాడు? ఈసినిమా కూడా గోవిందా'' అనుకొన్నారంతా. అయితే.. నాయుడు గారి నమ్మకం నిజమైంది.. ఆసినిమా సూపర్ హిట్టయ్యింది. మళ్లీ.. రామానాయుడు కాలర్ ఎత్తుకొని తిరిగారు. ఇక అక్కడి నుంచి వెనక్కు తిరిగి చూసుకొనే అవకాశమే రాలేదు.
కథానాయకుడిగా వెంకటేష్ రంగప్రవేశం కూడా రామానాయుడు పంతంతోనే జరిగింది. నాయుడుగారి పంతం, పట్టుదల.. తెలుగునాట ఓ అగ్రహీరో పుట్టడానికి కారణమైంది. అప్పట్లో కృష్ణగారితో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశారు నాయుడుగారు. సినిమాకి కావల్సిన సరంజామా అంతా సిద్ధం చేశారు. దర్శకుడి డేట్లున్నాయి. సాంకేతిక నిపుణుల్నీ పురమాయించేశారు. సడన్ ఈ సినిమా నుంచి అనివార్య కారణాల వల్ల కృష్ణ డ్రాప్ అయ్యారు. అనుకొన్న ముహుర్తానికి సినిమా మొదలెట్టకపోతే.. తనకు అవమానం అని భావించారు రామానాయుడు. అంతే.. ఫారెన్‌లో చదువుకొంటున్న వెంకటేష్‌ని హుటాహుటిన రంగంలోకి దింపేశారు. 'నువ్వు సినిమాల్లో నటిస్తావా?'అని అడిగారు. అప్పటి వరకూ అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వెంకటేష్ `ఓకే` అనేశారు. అలా కలియుగ పాండవులు సినిమా మొదలైంది. ఓ సూపర్ హిట్ హీరో కెరీర్‌కి బీజం పడింది.
ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించడం రామానాయుడు అలవాటు. అలా ఆయన పరిశ్రమకు ఆరుగురు హీరోలు, పన్నెండుమంది హీరోయిన్లు, ఇరవై ఒక్కమంది దర్శకులు, ఏడుగురు సంగీత దర్శకుల్ని పరిచయం చేసిన ఘనత మూటగట్టుకొన్నారు నాయుడు గారు. అవకాశం ఇస్తా..అని ఆయన మాట ఇచ్చారంటే.. ఆమాటపై నిలబడడానికైనా సరే.. సినిమా తీసేవారు. అలాంటి సందర్భాలు ఆయన జీవితంలో కోకొల్లలున్నాయి. సినిమా పోతుందని తెలిసినా - కొత్తవాళ్లను ప్రోత్సహించడానికి డబ్బులు పోయినా ఫర్లేదు అనుకొని రంగంలోకి దిగిపోయారు. అదేంటి సార్.. తెలిసి తెలిసి ఫ్లాప్ సినిమా తీశారు అని అడిగితే.. 'ఇదంతా నాకు సినిమానే ఇచ్చింది. మళ్లీ సినిమాకే పెడుతున్నా..' అనేవారు రామానాయుడు. సినిమాపై అంత ప్రేమ ఎవరికుంది ఈరోజుల్లో. ఆయన ఎప్పుడూ సినిమా పరిశ్రమకు అనుబంధంగా వ్యాపారాలు ప్రారంభించారే తప్ప.. ఒక్క అడుగు కూడా బయట వేయలేదు. తన ఇంటి నుంచి ఓ అగ్రశ్రేణి నిర్మాతనూ, ఓ స్టార్ కథానాయకుడ్ని అందించారు నాయుడుగారు. ఇద్దరు మనవళ్లూ హీరోలుగా రాణిస్తున్నారు. రూపాయినోటుపై ఉన్న అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి.. అరుదైన ఘనత సాధించిన నాయుడుగారు.. ఈమధ్యే సినీ కళామతల్లిని శోక సంద్రంలో ముంచేసి వెళ్లిపోయారు. తెలుగు సినిమాకీ, ప్రేక్షకులకు, సినీ అభిమానులకు ఇన్ని విలువైన సినిమాల్ని అరుదైన జ్ఞాపకాల్నీ వదిలి వెళ్లిపోయిన నాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొందాం..
(ఈరోజు రామానాయుడు జయంతి సందర్భంగా)