వర్మకు టెంపర్ నచ్చిందిరోయ్
on Nov 27, 2014
రాంగోపాల్ వర్మది పూర్తిగా రివర్స్ స్ట్రాటజీ. నలుగురికీ నచ్చినది ఆయనకు ఏమాత్రం నచ్చదు. అలా రివర్స్‌లో మాట్లాడితేనే మీడియాలో ఉంటాడన్న సంగతి తెలుసు. ఈసారి ఆయన ఎన్టీఆర్ టెంపర్ ఫస్ట్‌లుక్ గురించి కామెంట్లు చేశారు. టెంపర్ ఫస్ట్ లుక్ తనకు బాగా నచ్చిందని, పూరి డిజైన్ చేసిన హీరో పాత్రల్లో ఇదే బెస్ట్ అని ఓ కాంప్లిమెంట్ పాడేశాడు. ఈ సినిమా ముందు పోకిరి, బిజినెస్‌మెన్ బలాదూర్ అన్నాడు. ఎన్టీఆర్ బుల్లెట్‌లా ఉన్నాడని కితాబిచ్చాడు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తుంటే... తనకు ఎన్టీఆర్‌తో సినిమా చేసే అర్హత లేదనిపిస్తోందని సెటైర్‌లాంటిది వేశాడు. ఇదంతా ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి కాకాపడుతూ చేసిన కామెంట్లు కావట. నిజాయతీగానే చెప్తున్నాడట. ఏమో మరి... వర్మ ఏం చెప్పినా అందులో పెడర్థాలూ, నానార్థాలూ ఉంటాయి. ఇది వరకు కూడా అంతే. కేసీఆర్ కంటే అందగాడు మరొకడు లేడని, ఆయన ముక్కే సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అంటూ సిల్లీ కామెంట్లు చేశాడు. ఇప్పుడు టెంపర్ వెనుకా ఆ చిలిపిదనం ఉందా..?? లేదంటే నిజంగానే వర్మకి ఆ సినిమా నచ్చిందా?? ఇది వరకు పవన్ నామ జపం చేసిన రాంగోపాల్ వర్మకి ఇప్పుడు ఎన్టీఆర్ తేరగా కనిపిస్తున్నాడా? ఏమో మరి. వర్మ మాటలకు అర్థాలే వేరులే అని సరిపెట్టుకోవాలో, లేదంటే వర్మ కాంప్లిమెంట్లకు మురిసిపోవాలో సాక్ష్యాత్తూ.. ఎన్టీఆర్ అభిమానులకు సైతం అర్థం కావడం లేదు.