బాహుబలి Vs పులి
on Jun 27, 2015
బాహుబలికి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. బాహుబలి టీమ్ ఒక్క పైసా పబ్లిసిటీ గురించి ఖర్చు పెట్టకుండానే... మీడియా ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసింది. దానికి గల కారణం.. దక్షిణాదిన భారీ బడ్జెట్ చిత్రమిదే అవ్వడం, దానికి తోడు విజువల్‌వండర్‌గా బాహుబలిని తీర్చిదిద్దడం. అందుకే బాహుబలి ఖచ్చితంగా దక్షిణాదికి గర్వకారణమవుతుందని చిత్రసీమ ప్రముఖులు వేనోళ్ల పొగుడుతున్నారు. ఈ సినిమాకి పోటీగా ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. అదే.. `పులి`.
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం దక్షిణాదిన సంచలనం సృష్టిస్తోంది. ఇదో సోషియో ఫాంటసీ. బాహుబలిలానే ఇందులోనూ భారీతారాగణం ఉన్నారు. దాంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్న చిత్రమిది. కేవలం బాహుబలిని టార్గెట్ చేసుకొని, దాన్ని మించిన సినిమా తమిళంలో తెరకెక్కించాలని ఆ చిత్ర నిర్మాతలు కంకణం కట్టుకొన్నారట. అన్నట్టు `పులి` బడ్జెట్ ఎంతనుకొన్నారు.??. ఏకంగా రూ.120 కోట్లు. `ఐ` సినిమాకి శంకర్ దాదాపుగా రూ.160 కోట్లు ఖర్చు పెట్టాడు. `బాహుబలి` బడ్జెట్ కూడా ఇంచుమించుగా అంతే. అయితే ఈ రెండు సినిమాలకూ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఉంది.
విజయ్‌కి అలా కాదు. తమిళనాడులో మినహాయిస్తే.. పక్కనున్న మనరాష్ట్రంలో విజయ్ సినిమాలెప్పుడూ ఆదరణకు నోచుకోలేదు. కేవలం తమిళ మార్కెట్‌ని బేస్ చేసుకొనే ఈ సినిమాకి రూ.120 కోట్లు పెట్టుబడి పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఇంట్రడక్షన్ పాట కోసం రూ.5 కోట్లు ఖర్చుపెట్టారన్న టాక్... తమిళ చిత్రసీమలో సంచలనం సృష్టించింది. 70 రోజుల పాటు తెరకెక్కించిన క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.30 కోట్లు కేటాయించారట. పది రోజుల కాల్షీట్ల కోసం శ్రీదేవికి రూ.5 కోట్లు అర్పించారట. అలా.. ఈ సినిమా ఖర్చు తడిసిమోపెడయ్యింది.
ఖర్చు ఎంతైనా.. ఈసినిమా దక్షిణాదినే కాదు, యావత్ భారతీయ చలన చిత్రసీమలోనే సంచలనం అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అయితే.. విజయ్ సినిమాకి అంత సీన్‌లేదని... బాహుబలి ముందు పులి... బోసిబోతుందని కొంతమంది గుసగుసలాడుకొంటున్నారు. మొత్తానికి ఈ రెండు చిత్రాల మధ్య పోటీ రసవత్తంగా మారింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
