ప్రభాస్ ముచ్చటగా మూడో సంక్రాంతి.. మళ్ళీ అదే తేది!
on Jul 30, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధే శ్యామ్`కి కొత్త విడుదల తేదిని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 జనవరి 14న ఈ సినిమా రాబోతోందంటూ మేకర్స్ అనౌన్స్ చేసేశారు. సంక్రాంతి సీజన్ లో ప్రభాస్ సినిమా రావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే రెండు సార్లు ముగ్గుల పండక్కి పలకరించారు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. అందులో ఒక చిత్రం తన కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కాగా.. మరొకటి యావరేజ్ ఫిల్మ్. విశేషమేమిటంటే.. ఆ సినిమాలు కూడా `రాధే శ్యామ్`కి లాక్ చేసిన జనవరి 14నే రిలీజయ్యాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ లా నిలిచిన `వర్షం` 2004 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైంది. అప్పటివరకు సాలిడ్ హిట్ లేని ప్రభాస్ కి ఆ లోటు తీర్చడమే కాకుండా.. స్టార్ డమ్ ని తీసుకువచ్చింది. ఇక.. అదే జనవరి 14న 2007లో ప్రభాస్ నటించిన మరో సినిమా వచ్చింది. అదే.. `యోగి`. కన్నడ బ్లాక్ బస్టర్ `జోగి`కి రీమేక్ వెర్షన్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా.. యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది.
కట్ చేస్తే.. `రాధే శ్యామ్` రూపంలో ముచ్చటగా మూడోసారి సంక్రాంతిని లక్ష్యం చేసుకున్న ప్రభాస్.. మళ్ళీ జనవరి 14నే రాబోతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. ఒక బ్లాక్ బస్టర్ ని, ఒక యావరేజ్ ని అందించిన జనవరి 14.. ఈ సారి `డార్లింగ్`కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.