రైతు బిడ్డలారా ఒక్కటవ్వండి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న 'రాజధాని ఫైల్స్'
on Feb 13, 2024
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ట్రైలర్ తోనే తెలుగునాట సంచలనాలు సృష్టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో "రైతు బిడ్డలారా.. ఒక్కటవ్వండి" అంటూ తాజాగా మేకర్స్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఇప్పటికే విడుదలైన 'రాజధాని ఫైల్స్' ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్తోంది. రైతులకి జరిగిన అన్యాయాన్ని ఇమేజ్ ల రూపంలో కళ్ళకి కట్టినట్లు చూపిస్తూనే.. అద్భుతమైన వాయిస్ ఓవర్ తో రైతుబిడ్డల కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు.
"ప్రజలందరికీ మనవి. మనం ఇప్పుడు ఏ వృత్తిలో ఉన్నా.. ఒకప్పుడు మాత్రం రైతు బిడ్డలమే. ఆ రైతు బిడ్డలుగా ఆలోచిద్దాం. ఒక్కడి అహానికి వేలమంది రైతులు మోసపోయి ఉద్యమిస్తుంటే.. వెళ్లాలని ఉన్నా ఒక్కడుగు ముందుకు వేయలేకపోయాం. రాజధాని లేక మన రాష్ట్రం అవమాన భారంతో కృంగిపోతుంటే ఓదార్చాలని ఉన్నా భయంతో ఓదార్చలేకపోయాం. ఇప్పుడు ధైర్యంగా రైతులకు జరిగిన మోసాన్ని నిలదీస్తూ, రాజధాని కోసం ప్రశ్నిస్తూ.. ఫిబ్రవరి 15న మనముందుకు వస్తుంది రాజధాని ఫైల్స్ చిత్రం. కనీసం ఇప్పుడైనా థియేటర్ కి వెళ్ళి త్యాగమూర్తులైన రైతులకి సంఘీభావం ప్రకటిద్దాం. రాష్ట్రానికి రాజధానిని సాధిద్దాం. రైతులారా ఏకంకండి.. మన చిత్రాన్ని విజయవంతం చేయండి. ఇట్లు మీ రైతు బిడ్డ." అంటూ మోషన్ పోస్టర్ లో వినిపించిన వాయిస్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు పని చేయడం విశేషం.
ఇదిలా ఉంటే 'రాజధాని ఫైల్స్' ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఈరోజు(ఫిబ్రవరి 13) మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది.