'ఆర్ఆర్ఆర్' నటుడు కన్నుమూత.. కారణమేంటి?
on May 23, 2023

'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఉన్నప్పటికీ తన యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్(58). ఆయనకిది మొదటి ఇండియన్ సినిమానే అయినప్పటికీ.. ఒక్క సినిమాతోనే మన ప్రేక్షకులను ఎంతో దగ్గరయ్యారు. అయితే ఇప్పుడు ఆయన కన్నుమూశారనే వార్త 'ఆర్ఆర్ఆర్' మూవీ టీంతో పాటు అందరిని షాక్ కి గురి చేసింది.
నటుడిగా రే స్టీవెన్సన్ ది మూడు దశాబ్దాల ప్రయాణం. పలు ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఆర్ఆర్ఆర్'తో ఇండియన్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇటలీలోని ఇషియా ద్వీపంలో క్యాసినో అనే సినిమా చిత్రీకరణలో ఉండగా, ఆయన ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారని, ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా లాభం లేకుండా పోయిందని తెలుస్తోంది. చికిత్స పొందుతూ ఆయన ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. అసలు ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటి? ఉన్నట్టుండి కుప్పకూలిపోవడానికి కారణమేంటి తెలియాల్సి ఉంది.

రే స్టీవెన్సన్ మృతి పట్ల దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సంతాపం తెలిపారు. "ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన సెట్స్ లో ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అతనితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను" అని రాజమౌళి ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా "రే స్టీవెన్సన్ మరణవార్త విని షాక్ అయ్యాను. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



