అయ్యో అయ్యో దానయ్య.. ఒమిక్రాన్ దెబ్బకి 'ఆర్ఆర్ఆర్'కి 50 కోట్ల నష్టమయ్యా!
on Jan 5, 2022

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మూవీ మేకింగ్ విషయంలో ఎంత ప్లానింగ్ తో ఉంటాడో మూవీ ప్రమోషన్స్ విషయంలోనూ అంతే ప్లానింగ్ తో ఉంటాడు. తెలుగు సినిమాకి వంద కోట్ల మార్కెట్ కూడా సరిగా లేని సమయంలో 'బాహుబలి' తీసి వందల కోట్ల కలెక్షన్స్ తో రాజమౌళి సంచలనం సృష్టించాడు. ఆయన సినిమాని తెరకెక్కించడంలో ఎంత ఫోకస్ పెడతాడో.. ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ అంతే ఫోకస్ పెడతాడు. దాని ఫలితమే బాహుబలి సృష్టించిన సంచలనం.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి మరింత కేర్ పెట్టాడు. విడుదలకి నెలరోజుల ముందు నుంచే మూవీ టీమ్ తో కలిసి భారీగా ప్రమోషన్స్ చేశారు. ముంబై, చెన్నై, త్రివేండ్రం ఇలా పలు నగరాల్లో భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని నిర్వహించారు. హిందీ బిగ్ బాస్, కపిల్ శర్మ షో ఇలా పలు షోలలో మూవీ టీమ్ సందడి చేసింది. అన్ని భాషల్లో ప్రెస్ మీట్లతో హోరెత్తించింది. కొన్నిరోజుల పాటు టీవీలలో, సోషల్ మీడియాలలో ఆర్ఆర్ఆర్ మారుమోగిపోయింది. ఇలా ప్రమోషన్స్ తో దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్.. ఒమిక్రాన్ ఎంట్రీతో దాదాపు రూ.50 కోట్ల నష్టాన్ని మూటుగట్టుకున్నట్లు తెలుస్తోంది.
కరోనా కారణంగా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ జనవరి 7 న ఖచ్చితంగా విడుదలవుతుందని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. సెకండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ రీఓపెన్ అయ్యి, పరిస్థితులు చక్కబడటంతో.. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ఫైనల్ కాపీని రెడీ చేసుకొని భారీస్థాయిలో ప్రమోషన్స్ చేపట్టింది. కొన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ పేరు మారుమోగిపోయింది. ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించారు. కరణ్ జోహార్ హోస్ట్ గా, సల్మాన్ ఖాన్ గెస్ట్ గా సందడి చేశారు. రాజమౌళి, తారక్, చరణ్, ఆలియా భట్ పాల్గొన్న ఈ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల నుంచి తారక్, చరణ్ ల ఫ్యాన్స్ ని భారీగా తరలించారు. రాజమౌళి మీద నమ్మకంతో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, టీవీ షోలు, ప్రెస్ మీట్లు పేరుతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం దాదాపు రూ.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ కి అయిన ప్రీరిలీజ్ బిజినెస్, వచ్చే కలెక్షన్స్ తో పోల్చితే రూ.50 కోట్లు పెద్ద అమౌంట్ కాదన్న ఉద్దేశంతో ఆ స్థాయిలో ఖర్చు పెట్టారట. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రాకతో ఆ 50 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి.
ఒమిక్రాన్ వేరియంట్ రాకతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలలో థియేటర్స్ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ విడుదలని వాయిదా వేశారు. దాంతో ఇప్పటిదాకా ప్రమోషన్స్ పేరుతో ఖర్చు చేసిన డబ్బంతా వృధా అయిపోయింది. ఆర్ఆర్ఆర్ విడుదల మళ్ళీ మూడు నాలుగు నెలల తర్వాత ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ చేయాలి. ఇప్పటికే దాదాపు 50 కోట్ల నష్టం, దానికి తోడు వడ్డీలు పెరుగుతాయి. కొత్త విడుదల తేదీ తర్వాత మళ్ళీ ప్రమోషన్స్ కి ఖర్చు చేయాలి. ఇలా ఒమిక్రాన్ రాక నిర్మాత దానయ్యకి భారీస్థాయిలో నష్టాన్ని కలిగించింది. దీంతో రెడీ సినిమాలోని సాంగ్ ని గుర్తు చేసుకుంటూ 'అయ్యో అయ్యో దానయ్య' అంటూ దానయ్యపై నెటిజన్లు జాలిపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



