'మా' గురించి ఆర్జీవీ షాకింగ్ ట్వీట్.. వాళ్లంతా జోకర్లే!
on Oct 19, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) రాజకీయ ఎన్నికలను తలపించేలా జరిగాయి. ఎన్నికలు ముగిశాక కూడా వేడి చల్లారలేదు. ఓ వైపు మా ఎన్నికల్లో గెలిచిన విష్ణు.. తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రమాణస్వీకారం చేసి.. మా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎప్పుడూ లేని విధంగా ఎన్నికలు ముగిశాక కూడా మాలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మా'పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తల్లో నిలిచే ఆర్జీవీ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పైనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. "సిని'మా' పూర్తిగా జోకర్లతో నిండిపోయిన ఓ సర్కస్" అంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా కొందరు తప్పుబడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని రీసెంట్ గా మంచు విష్ణు అన్నారు. వారి రాజీనామా లేఖలు తమకు ఇంకా అందలేదని, అవి అందిన తర్వాతే వాటిపై స్పందిస్తానని చెప్పారు. మరి ఈ 'మా' రచ్చ ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.