టైగర్ కేసీఆర్... వర్మ సినిమా!
on Apr 18, 2019
ఏం చేస్తే పబ్లిసిటీ వస్తుందనేది సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. ఆయనకది వెన్నతో పెట్టిన విద్య. వర్మ తీసిన సినిమాలు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడతాయో... అంతకంటే ఎక్కువ రోజులు మీడియాలో వర్మ సినిమా వార్తలు వస్తాయి. ఎందుకంటే... వర్మ ఎంపికచేసుకునే కథాంశాలు అటువంటివి. రక్త చరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన 'కోబ్రా'తో సహా! ఈరోజు అటువంటి సినిమాను వర్మ ప్రకటించారు. సారీ సారీ... ఒక ట్వీట్ వేసి ఊరుకున్నారు. సినిమా టైటిల్... 'టైగర్ కేసీఆర్' (పోస్టర్ ను బట్టి). ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయోపిక్ ఇది. ఈ సినిమా కాప్షన్ ఏంటో తెలుసా? 'ది అగ్రస్సివ్ గాంధీ'!
తెలంగాణ వాళ్లను ఆంధ్ర ప్రజలు థర్డ్ క్లాస్ పీపుల్ గా ట్రీట్ చేయడాన్ని తట్టుకోలేని కేసీఆర్.... తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎటువంటి పోరాటం చేశాడు? ఎలా తెలంగాణ సాధించారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్న ట్లు వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వర్మ ప్రకటించలేదు. శశి లలిత... కోబ్రా... ఇప్పుడీ టైగర్ కేసీఆర్... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల తర్వాత తమ ప్రకటించిన సినిమాల జాబితా. వీటిలో ఏది ముందు వస్తుందో? ఏది అటక ఎక్కుతుందో?