'పుష్ప-2' టీమ్ కి బస్సు యాక్సిడెంట్!
on May 31, 2023
'పుష్ప-2' టీమ్ ప్రయాణిస్తున్న బస్సుకి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎవరికీ తీవ్ర గాయాలు కాకుండా, అందరూ క్షేమంగా బయటపడటంతో మూవీ టీమ్ ఊపిరి పీల్చుకుంది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప-1' పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో భాగం 'పుష్ప -2' రూపొందుతోంది. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లిలో తాజా షెడ్యూల్ జరిగింది. అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ సహా పలువురు నటీనటులు పాల్గొన్న ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. నిన్నటితో ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో కొందరు ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ ఓ ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నార్కట్ పల్లి వద్ద ఈ బస్సు, మరో బస్సు ఢీ కొన్నాయి. అయితే బస్సులు మితిమీరిన వేగంతో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరికి స్వల్ప గాయాలు కావడం తప్ప, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. స్వల్ప గాయాలు తగిలిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారట.
Also Read