ENGLISH | TELUGU  

పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న ఫ్యాన్స్

on Dec 4, 2014

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటుడిగా కానీ, వ్యక్తిగా కానీ ఒక పద్ధతి వున్న మనిషి. ఆయన ఏ పని చేసినా ఒక ప్రణాళిక ప్రకారం, ఒక విధానం ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. లేనిపోని బిల్డప్పులు లేకుండా క్రమశిక్షణతో, నిరాడంబరంగా తన దారిలో తాను వెళ్తూవుంటారు. ఆయనతో ఎవరికీ ఎలాంటి సమస్య లేదు. ఆయనకున్న చాలామంది ఫ్యాన్స్‌తో కూడా ఎవరికీ సమస్య లేదు. అయితే కొంతమంది ఆయన ఫ్యాన్స్‌ని చూస్తేనే విచిత్రంగా అనిపిస్తూ వుంటుంది. వాళ్ళకి అసలు వెన్నెముక అనేది వుందా.. వాళ్ళకి ఏదైనా మానసిక సమస్య వుందా.. ఇంకా చెప్పాలంటే మెంటల్ లాంటిదేదైనా వుందా అనిపిస్తూ వుంటుంది. ఆ మెంటల్ ఎప్పటికి తగ్గుతుందా... అసలు తగ్గే అవకాశం వుందా అనే సందేహాలు కూడా కలుగుతూ వుంటాయి. పాపం ఫ్యాన్స్ విషయంలో ‘మెంటల్’ అనే మాట ఉపయోగిస్తారా అని కొందరికి అనిపించవచ్చు. కానీ, వాళ్ళ వ్యవహారశైలిని పరిశీలిస్తున్న వారికి ఆ మాటని ఉపయోగించడంలో ఎంతమాత్రం తప్పు లేదని అనిపిస్తుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని విమర్శించాల్సి రావడం వెనుక వున్న అసలు కారణాలేమిటి?

సాధారణంగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలని ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటారు. ఆ హీరో ఎప్పుడైనా తమకు కనిపిస్తే ఉత్సాహంతో, ఆనందంతో కేరింతలు కొడతారు. తమ జన్మ ధన్యమైపోయిందని అనుకుంటారు. ఎవరి ఆనందం వారిది. అంతవరకు ఎలాంటి తప్పు, పొరపాటు లేదు. అయితే ఆ అభిమానం ముదిరిపోయి, ఇతరులను ఇబ్బందిపెట్టే ఉన్మాదం స్థాయికి వెళ్తేనే తప్పు. అది సదరు ఫ్యాన్స్‌కి, వారి కుటుంబాలకి, సమాజానికి కూడా నష్టం చేస్తుంది. వారి అభిమాన హీరోకి చిరాకు పుట్టిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొంతమంది ఇప్పుడు ఈ దశలోకి చేరుకున్నారు. చిరంజీవి కుటుంబానికి చెందిన ఏ సినిమా ఫంక్షన్ జరిగినా ఆ ఫంక్షన్‌లో వారి ఉన్మాదం బయటపడుతూ వుంటుంది.

చిరంజీవి కుటుంబంలో హీరోల సంఖ్యకి తక్కువేమీ లేదు. తెలుగు సినిమారంగంలో అనేకసార్లు ఆ హీరోలకి చెందిన ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే వుంటుంది. ఆ ఫంక్షన్లకి బోలెడంతమంది అభిమానులు వస్తూ వుంటారు. సదరు ఫంక్షన్లని చూసి ఆనందించి వెళ్తూ వుంటారు. అయితే  కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ఆనందాన్ని పొందడం మానేసి ఉన్మాదాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా ‘‘‘పవన్ కళ్యాణ్ ఎక్కడ?’’ అనో.. ‘‘పవన్.. పవన్’’ అనో, ‘‘ఉయ్ వాంట్ పవన్ కళ్యాణ్’’ అనో గోలగోల చేస్తున్నారు. వేదిక మీద చిరంజీవి వున్నా, ఏ ఇతర అగ్రహీరోలు వున్నా వాళ్ళని ఎంతమాత్రం పట్టించుకోకుండా ‘‘పవన్ కళ్యాణ్... పవన్ కళ్యాణ్’’ అంటూ గోల చేయడం మొదలుపెడతారు. చిరంజీవితో సహా ఎవరు మాట్లాడుతున్నా డిస్ట్రబ్ చేస్తూ ‘పవన్ కళ్యాణ్’ అంటూ రంకెలు వేస్తూ వుంటారు. వీరి ధోరణి స్టేజీ మీద వున్న సినీ ప్రముఖులకు మాత్రమే కాదు.. ఆడిటోరియంలో వున్న మిగతావారికి కూడా చిరాకు తెప్పిస్తోంది.

పవన్ ఫ్యాన్స్ గోల చేస్తున్న ఫంక్షన్‌కి పవన్ కళ్యాణ్ ఎలాగూ వచ్చి వుండరు. ఆయన బిజీగా వుండటం వల్లో, మరే కారణం వల్లో ఆయన హాజరుకారు. ఆయన రాలేదు కాబట్టి కళ్ళు తెరుచుకుని, నోరు మూసుకుని ఫంక్షన్‌ని ఆస్వాదించాలి. లేకపోతే ఫంక్షన్లోంచి బయటకి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రావాల్సిందే అని గొడవ చేయడమేంటి? వీళ్ళు గొడవ చేసినంతమాత్రాన పవన్ కళ్యాణ్ అర్జెంటుగా వచ్చేస్తాడా? పోనీ అదేమైనా పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఫంక్షనా? పవన్ కళ్యాణ్ సొంత సినిమా ఫంక్షన్‌కి ఆయన రాకపోతే... సర్లే ఫ్యాన్స్ ఫీలైపోయి గొడవ చేశారని అనుకోవచ్చు. చిరంజీవి ఫ్యామిలీలోని ఇతర హీరోల ఫంక్షన్లకి ఆయన రాలేదని గొడవ చేయడమేంటి? నేను చిరంజీవి ఫ్యామిలీ నిర్వహించే ప్రతి సినిమా ఫంక్షన్‌కీ వస్తానని పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌కి ఏదైనా హామీ ఇచ్చారా? అలాంటప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో ఇతర హీరోల ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూసెన్స్ ఏమిటి?



పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గతంలో ఎన్నో ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ రావాలంటూ గోలగోల చేశారు. తాజాగా బుధవారం నాడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ముకుంద’ ఆడియో ఫంక్షన్లో అయితే టూమచ్‌గా రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ రావాల్సిందేనంటూ నానా హడావిడి చేశారు. చిరంజీవి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా పవన్.. పవన్.. అంటూ ఒకటే గోల. చివరికి చిరంజీవి పవన్ కళ్యాణ్ బిజీగా వున్నందువల్ల రాలేకపోయాడని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన రాలేదని ఈయన వివరణ ఇచ్చుకోవాల్సి రావడమేంటి ఖర్మకాకపోతే! పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల ధాటికి పాపం కొత్త హీరో వరుణ్ తేజ్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బాబాయి ‘గోపాల గోపాల’ షూటింగ్ కోసం వారణాసిలో వున్నందువల్ల రాలేదని.. ఆయన రాకపోయినా ఆయన ఆశీస్సులు తనకు పుష్కలంగా వుంటాయని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పాల్సి వచ్చింది. చిరంజీవి వివరణ ఇస్తున్నప్పటికీ పవన్ ఫ్యాన్స్ వినకుండా గోల గోల చేశారు. చివరికి చిరంజీవి ‘‘వదిలేయండి.. ప్లీజ్’’ అని బతిమాలుకోవాల్సి వచ్చింది. తనవల్ల పైకి వచ్చిన పవన్ కళ్యాణ్‌కి ఉన్నంత విలువ తనకు లేకపోవడం చూసి పాపం చిరంజీవి మనసులో ఎంత బాధపడి వుంటారో!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరాచకం చిరంజీవి ఫ్యామిలీ ఫంక్షన్లతో ఆగలేదు. చిరంజీవి ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేని నితిన్ సినిమా ఫంక్షన్లో కూడా వీళ్ళు గందరగోళం చేశారు. ఈమధ్య నితిన్ నటించిన ‘చిన్నదాన నీకోసం’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్‌కి అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ న్యూసెన్స్ చేసిపెట్టారు. ‘‘పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్..’’ అని ఒకటే గోల. ఫంక్షన్‌కి వచ్చిన నాగార్జునని పట్టించుకోకుండా, రాని పవన్ కళ్యాణ్ గురించి న్యూసెన్స్ ఏంటసలు? ఇంతకీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్మాద ఫ్యాన్స్ గొడవ దేనికంటే... పవన్ కళ్యాణ్‌‌కి హీరో నితిన్ ఫ్యాన్ అట.. ఇది నితిన్ సినిమా ఫంక్షన్ కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రావాలట. ఈ డిమాండ్‌లో ఎంత వెతికినా లాజిక్ కనిపిస్తోందా? పాపం నాగార్జున మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోలగోల చేసేసరికి ఆయన చిన్నబుచ్చుకున్నారు. ‘‘నేను ఈ ఫంక్షన్‌లో మాట్లాడ్డం వీళ్ళకి ఇష్టం లేదనుకుంటా’’ అని కూడా అనేశారు.

ఇదీ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌లోని కొంతమంది పరిస్థితి. ఇలాంటి వాళ్ళని ‘ఫ్యాన్స్’ అని పిలవాలన్నా ఇబ్బందిగా వుంటుంది. ఇలాంటి క్రమశిక్షణ లేని ఫ్యాన్స్ పగవాళ్ళకి కూడా వుండకూడదు! ఇలాంటి మెంటల్ ఫ్యాన్స్‌ని అదుపులో పెట్టాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్‌దే... ఎందుకంటే ఇలాంటి కొంతమంది ఫ్యాన్స్ వల్ల పోతున్నది ఆయన పరువే!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.