పవన్ ఎంత మారిపోయాడో...??
on Nov 11, 2016

సినిమా స్టార్‌గా పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?? అందరూ ఆయనకు అభిమానులే. అయితే జన సేన అధ్యక్షుడిగా మాత్రం.. ఆయన్ని విమర్శించేవాళ్లు ఎక్కువయ్యారు. మరీ ముఖ్యంగా ఆయన ప్రసంగాలు ముక్తసరిగా సాగిపోతాయని, అవగాహనా లోపం ఎక్కువగా కనిపిస్తుందని, ఎవరో రాసిస్తుంటే తెగ చదివేస్తుంటాడని, సినిమా డైలాగుల్లా పంచ్‌లు వేస్తాడని ఇలా రకరకాల విమర్శలు. అందులో నిజం లేకపోలేదు. పవన్ ఇప్పటి వరకూ చాలా సభలు, సమావేశాలు నిర్వహించాడు. అయితే పవన్ స్పీచుల్లో ఎక్కడా క్లారిటీ కనిపించేది కాదు. అయితే అనంతపురం సభలో పవన్ మాట్లాడిన తీరు, ఈరోజు అనంతపురంలోని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన విధానం చూస్తుంటే పవన్‌లో పరిపక్వత కనిపిస్తోంది.
అరుపులు, కేకలు పక్కన పెట్టి.. ఓర్పుతో, చాలా నిదానంగా.. విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్న తీరు.. ముచ్చట గొలుపుతోంది. అనంతపురం పరిస్థితుల్ని, అక్కడి కరువుని, ఆర్థిక, సామాజిక వెనుకబాటు తనాన్ని అర్థం చేసుకొన్నవాడిలా కనిపించాడు. ప్రభుత్వాలపై రొటీన్‌గా విరుచుకుపడిపోవడం, పాలకుల్ని బూతులు తిట్టడం, వాళ్ల విధానాల్ని వన్ సైడ్‌లో నిలబడి విమర్శించే రాజకీయ నాయకుల మధ్య.. పవన్ కాస్త బెటర్ పొలిటీషియన్ లా కనిపించాడు. తానేదో చేసేస్తానని, పొడిచేస్తానని కూడా పవన్ చెప్పడం లేదు.. తన వంతు కృషి చేస్తా అంటూ మాటిస్తున్నాడు. అదే.. అందరికీ నచ్చుతోంది. పవన్ ముక్తసరి స్పీచుల్ని కట్టబెట్టి.. లోతుగా మాట్లాడడం, సమస్యల్ని మరింత క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం రాజకీయ విశ్లేషకుల మన్ననలు అందుకొంటోంది. 2019 ఎన్నికలు దగ్గర పడేకొద్దీ.. పవన్‌లోని సిసలైన రాజకీయ నేత పూర్తి స్థాయిలో బయటకొస్తాడేమో చూడాలి. ఇప్పటికైతే పవన్‌ని విమర్శించే వాళ్లు కూడా.. `బెటర్ అయ్యాడు` అనుకొనేలా కనిపిస్తున్నాడు. గో హెడ్ పవన్.... గోహెడ్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



