'పోకిరి'ని మించేలా 'ఒక్కడు' రీరిలీజ్.. డేట్ కూడా వచ్చేసింది!
on Sep 5, 2022
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఊపందుకుంది. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజుకి 'పోకిరి 4k', పవన్ కళ్యాణ్ బర్త్ డేకి 'జల్సా 4k' స్పెషల్ షోలు వేయగా దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యి భారీ కలెక్షన్స్ తో సత్తా చాటాయి. అలాగే ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23)కి 'బిల్లా 4k' సందడి చేయనుంది. ఇక సీనియర్ హీరో కృష్ణ అయితే వచ్చే ఏడాది 'సింహాసనం 8k'తో అలరించనున్నారు. ఇదిలా ఉంటే మహేష్ నటించిన మరో మూవీ రీరిలీజ్ కి సిద్ధమవుతోంది.
మహేష్ కి భారీ కమర్షియల్ సక్సెస్ అందించి స్టార్ గా నిలబెట్టిన సినిమా 'ఒక్కడు'. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భూమిక హీరోయిన్. జనవరి 15, 2003న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ని రీరిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ఎంఎస్ రాజు తాజాగా ప్రకటించారు. 2023 జనవరికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జనవరి 8, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేయబోతున్నట్లు తెలిపారు. నాలుగు నెలల ముందుగానే 'ఒక్కడు' రీరిలీజ్ ప్రకటన రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన ఒక్కడు స్పెషల్ షో చూసేందుకు వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.