మెగా మల్టీస్టారర్.. ఒకే సినిమాలో చిరు, పవన్, చరణ్!
on Jul 30, 2024
ఒకే కుటుంబానికి చెందిన హీరోలు తెరను పంచుకుంటే చూడాలని అభిమానులు ఆశపడుంటారు. 'మనం' సినిమా రూపంలో ఇప్పటికే అక్కినేని (Akkineni) అభిమానులకు ఆ అదృష్టం లభించింది. మూడు తరాలకు చెందిన హీరోలు ఈ సినిమాలో నటించారు. నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు పోషించగా.. అఖిల్ అతిథి పాత్రలో మెరిశాడు. ఇది అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ ఫిల్మ్ గా నిలవడమే కాకుండా.. టాలీవుడ్ లో క్లాసిక్ సినిమాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దీంతో ఇలాంటి సినిమా కోసం మిగతా హీరోల అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే అక్కినేని అభిమానుల తర్వాత ఆ అదృష్టం మెగా అభిమానులను వరించే అవకాశం కనిపిస్తోంది.
మెగా హీరోలు చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan) కలిసి స్క్రీన్ చేసుకుంటే ఎలా ఉంటుంది?.. ఊహిస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అలాంటి సంచలన కాంబినేషన్ లో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేశాడు. రీసెంట్ గా 'మిస్టర్ బచ్చన్' మూవీ ప్రమోషన్స్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు, చరణ్, చిరంజీవి గారి కలయికలో మల్టీస్టారర్ కోసం ఒక కథపై వర్క్ చేస్తున్నానని, ఒకవేళ అది సాధ్యమైతే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అవుతుందని చెప్పాడు. హరీష్ శంకర్ చెప్పిన ఈ ఒక్క మాట.. మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా.. మీడియా, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
ఈ ముగ్గురు మెగా స్టార్స్ ఇప్పటిదాకా ఒకే సినిమాలో కలిసి నటించింది లేదు. గతంలో చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్ దాదా MBBS', 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాల్లో పవన్ కళ్యాణ్ క్యామియో రోల్స్ చేశారు. అలాగే రామ్ చరణ్ హీరోగా నటించిన 'మగధీర', 'బ్రూస్ లీ' సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రోల్స్ చేశారు. అంతేకాదు చిరంజీవి, చరణ్ కలిసి 'ఆచార్య'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇలా ఇద్దరు విడివిడిగా స్క్రీన్ చేసుకున్నారు కానీ.. ముగ్గురు ఒకే సినిమాలో సందడి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు కాంబోలో సినిమా చేయడానికి హరీష్ శంకర్ ప్రయత్నిస్తున్నాడు.
హరీష్ శంకర్ కి మెగా హీరోలంటే ప్రత్యేక అభిమానం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి 'గబ్బర్ సింగ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ సినిమా అంటే అభిమానులకు ట్రీట్ లా ఉంటుంది. అలాంటిది ఆయన దర్శకత్వంలో చిరు, పవన్, చరణ్ కలిసి నటిస్తే.. ఇక మెగా అభిమానులకు అంతకుమించిన ఆనందం ఉండదేమో. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని ఆశిద్దాం.
Also Read