ముచ్చటగా మూడు.. తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేసిన జాన్వీ!
on Jul 16, 2024
తెలుగులో తను నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. 2018లో వచ్చిన 'ధడక్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. తక్కువ సమయంలోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్స్ పట్టేస్తోంది. తెలుగులో మొదటి సినిమాకే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లాంటి బిగ్ స్టార్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. కొరటాల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న 'దేవర' (Devara)లో జాన్వీ హీరోయిన్. ఇక రెండో సినిమాకి మరో బిగ్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ 16 వ సినిమాగా రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ లోనూ జాన్వీనే హీరోయిన్. ఇక ఇప్పుడు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ భాగం కానున్నట్లు సమాచారం.
'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని (Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో 33వ సినిమాగా రూపొందనుంది. లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది. ఇదిలా ఉంటే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా లాక్ అయినట్లు తెలుస్తోంది.
తెలుగులో జాన్వీ మొదటి సినిమా 'దేవర' సెప్టెంబర్ 27న విడుదల కానుంది. రెండో సినిమా 'RC16' ఆగష్టు లేదా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ తర్వాత 'Nani 33' ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ మూడు సినిమాల్లో ఏవైనా రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే.. తెలుగులో జాన్వీ మరింత బిజీ అవుతుంది అనడంలో సందేహం లేదు.
Also Read