ఎన్టీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నాడు.. భయమా..?
on Jul 10, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన సినిమాలతోనే ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్స్ సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అలాగే, ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులకు కేవలం వారి ప్రతిభను నమ్మి అవకాశమిచ్చి.. వారితో హిట్స్ కొట్టే హీరోగా ఎన్టీఆర్ కి పేరుంది. అంతేకాదు, ప్రతిభావంతులైన యువ దర్శకులను గుర్తించడంలోనూ ఎన్టీఆర్ ముందుంటాడు. కానీ ఎందుకనో వారితో సినిమాలు తీయడానికి మాత్రం వెనకాడుతుంటాడు.
'స్వామిరారా' అనే క్రైమ్ కామెడీ మూవీతో సుధీర్ వర్మ డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన ఈ మూవీ 2013 లో విడుదలై సర్ ప్రైజ్ హిట్ గా నిలిచింది. స్టార్స్ లేకుండా తక్కువ బడ్జెట్ తో చేసిన ఈ మూవీతో సుధీర్ వర్మ ఇంప్రెస్ చేశాడు. అతని ప్రతిభకి ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యాడు. అంతేకాదు ఆ సమయంలో ఎన్టీఆర్ కి సుధీర్ ఒక కథని వినిపించాడు. వీరి కాంబినేషన్ లో సినిమా రానుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
2016 లో వచ్చిన 'పెళ్ళి చూపులు' మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తరుణ్ భాస్కర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది?', 'కీడా కోలా' వంటి సినిమాలతోనూ ఆకట్టుకున్నాడు. అయితే మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి తరుణ్ ప్రయత్నించాడు. వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. ఈ కాంబోలో మూవీ ఉంటుందని ఆ టైంలో న్యూస్ గట్టిగానే వినిపించింది. కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకనో పట్టాలెక్కలేదు.
ఇక ఇప్పుడు మరో యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే మెప్పించాడు శౌర్యవ్. ఈ యంగ్ డైరెక్టర్.. రెండో సినిమాకే ఏకంగా ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని రీసెంట్ గా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో కొంతే వాస్తవం ఉందనేది సన్నిహితవర్గాల మాట. శౌర్యవ్ ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పిన మాట నిజమేనని అంటున్నారు. అయితే శౌర్యవ్ టాలెంట్ కి, అతను చెప్పిన స్టోరీకి ఎన్టీఆర్ ఇంప్రెస్ అయినప్పటికీ.. సినిమా చేయడానికి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. దీంతో సుధీర్ వర్మ, తరుణ్ భాస్కర్ ల సినిమాల తరహాలోనే.. ఇది కూడా ప్రచారానికే పరిమితవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ ఒక బిగ్ స్టార్. పైగా మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా అంటే ఆడియన్స్ లో భారీ అంచనాలుంటాయి. ఇక ఈ ముగ్గురు యువ దర్శకుల విషయానికొస్తే.. కమర్షియల్ డైరెక్టర్స్ కాదు. పైగా ఈ ముగ్గురి మొదటి సినిమాలు ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ కి సెట్ అయ్యే కథలు కావు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే.. తన స్టార్డంని సరిగా హ్యాండిల్ చేస్తారా లేదా? ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారా? వంటి ఆలోచనలతో భయపడుతూ.. ఎన్టీఆర్ యువ దర్శకులతో సినిమాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నాడేమో అనిపిస్తోంది.
Also Read