బాలీవుడ్‌లో కలకలం.. ‘కల్కి’ కలెక్షన్స్ చూసి టెన్షన్ పడుతున్న హీరోలు!
on Jul 10, 2024
పాతరోజుల్లో ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాగానే పరిగణించేవారు. ఆరోజుల్లో బాలీవుడ్ తన ఆధిపత్యాన్ని చూపించేది. ఇండియాలోని మిగతా భాషా చిత్రాలకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే కళాత్మక చిత్రాలు, అవార్డు చిత్రాల విషయంలో మాత్రం బెంగాలీ చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఆ దశలో సౌత్ సినిమాలను అసలు పట్టించుకునేవారు కాదు. బడ్జెట్ పరంగా, మార్కెట్ పరంగా, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ సినిమాలు సౌత్ సినిమాల కంటే ఎంతో ముందుండేవి. అలాంటి పరిస్థితి నుంచి బాలీవుడ్ సినిమాలను పక్కకు పెట్టే స్థాయికి సౌత్ సినిమాలు చేరుకున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా బాలీవుడ్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈమధ్య కాలంలో ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాల కలెక్షన్ రికార్డులను క్రాస్ చేశాయి.
తాజాగా తెలుగు సినిమా స్టామినా ఏమిటో మరోసారి బాలీవుడ్‌కి రుచి చూపిస్తోంది ‘కల్కి’. 2024 సంవత్సరంలో ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఏడాదికి హిందీలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘కల్కి’ రికార్డు సృష్టిస్తోంది. జనవరిలో రిలీజ్ అయిన హృతిక్ రోషన్ సినిమా ‘ఫైటర్’ హయ్యస్ట్ గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఉంది. ఆ సినిమా రూ.215 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. గత నెల 27న విడుదలైన ‘కల్కి’ హిందీ వెర్షన్ ఓపెనింగ్ రోజునుంచే అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తూ ఇప్పటికే రూ.200 కోట్లు దాటేసింది. ఇప్పుడు ‘ఫైటర్’ ఓవరాల్ కలెక్షన్‌ను ‘కల్కి’ క్రాస్ చేసేసింది. ఈ సినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ ప్రతిరోజూ 10 కోట్లకు తక్కువ కాకుండా కలెక్ట్ చేస్తోంది. ఫుల్ రన్‌లో రూ.250 కోట్లు క్రాస్ చెయ్యడం ‘కల్కి’కి పెద్ద విషయం కాదన్నది ఇప్పటి కలెక్షన్ ట్రెండ్‌ని చూస్తే అర్థమవుతుంది. ఈ ఏడాదిలోనే మరికొన్ని హిందీ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అప్పటివరకు హిందీలో హయ్యస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రంగా ‘కల్కి’ నిలిచే అవకాశం ఉంది.
Also Read