ఇదెక్కడి ట్విస్ట్ దిల్ మావ.. రౌడీ బాయ్స్ మళ్ళీనా..!
on Apr 23, 2024
స్టార్ హీరోల సినిమాలు లేదా చిన్న హీరోల హిట్ సినిమాలు రీ రిలీజ్ చేయడం సహజం. కానీ ఒక కుర్ర హీరో నటించిన ఫ్లాప్ మూవీని రీ రిలీజ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. పైగా అది ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) కాంపౌండ్ కి చెందిన సినిమా కావడం విశేషం.
తన సోదరుడు శిరీష్ కుమారుడైన ఆశిష్ రెడ్డి(Ashish Reddy)ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం 'రౌడీ బాయ్స్' (Rowdy Boys). 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాకి పలువురు స్టార్ టెక్నీషియన్స్ పనిచేశారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఆర్.మధి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. అయితే 2022 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టాలీవుడ్ లో కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. దిల్ రాజు రీ రిలీజ్ చేయాలనుకుంటే ఆయన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అలాంటిది ఊహించని విధంగా 'రౌడీ బాయ్స్'ని మళ్ళీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. 'రౌడీ బాయ్స్' చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో మళ్ళీ సందడి చేయనుందని తెలుపుతూ.. హైదరాబాద్, విజయనగరం, కర్నూల్, ఏలూరు నగరాల్లోని థియేటర్ల వివరాలు ఇచ్చారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. నెటిజన్లు మాత్రం దిల్ రాజు కాంపౌండ్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు తమదైన శైలిలో ట్రోల్ కూడా చేస్తున్నారు.