ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్.. 200 కోట్లు ఏంటి సామీ!
on Apr 16, 2024
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్(Prabhas).. ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. కొన్నేళ్లుగా వసూళ్ల పరంగా, బిజినెస్ పరంగా టాప్ సినిమాల లిస్ట్ తీస్తే.. వాటిలో మెజారిటీ సినిమాలు ప్రభాస్ వే ఉంటున్నాయి. అంతలా ఆయన రేంజ్ పెరిగిపోయింది. తాజాగా ప్రభాస్, మరోసారి తన రేంజ్ ఏంటో చూపించాడు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD'(Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ లేదా జులైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'కల్కి 2898 AD' థియేట్రికల్ బిజినెస్ కళ్ళు చెదిరేలా జరుగుతోందట. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.200 కోట్ల బిజినెస్ చేసిందని తెలుస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే తెలుగు స్టేట్స్ లో రూ.200 కోట్ల బిజినెస్ చేసిన మొదటి సినిమా 'కల్కి' కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల బిజినెస్ పరంగా రూ.191 కోట్లతో 'ఆర్ఆర్ఆర్' టాప్ లో ఉండగా.. ఇప్పుడు దానిని దాటేసి 'కల్కి' టాప్ లోకి వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.145 కోట్లతో 'సలార్', రూ.122 కోట్లతో 'బాహుబలి 2', రూ.121 కోట్లతో 'సాహో', రూ.120 కోట్లతో 'ఆదిపురుష్' ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా ప్రభాస్ వే కావడం మరో విశేషం.
ఇక వరల్డ్ వైడ్ గా 'కల్కి 2898 AD' మూవీ రూ.350 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2' తర్వాత ఆ స్థాయి బిజినెస్ చేసిన తెలుగు సినిమా ఇదే. మరి వసూళ్ల పరంగానూ ఆ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.