'ఫ్యామిలీ స్టార్' మూవీ రివ్యూ
on Apr 5, 2024
సినిమా పేరు: ఫ్యామిలీ స్టార్
తారాగణం: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతి బాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి, వాసుకి, రవి ప్రకాష్, అభినయ, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
డీఓపీ: కె.యు. మోహనన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2024
2018 లో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కలయికలో వచ్చిన 'గీత గోవిందం' చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత విజయ్ కి ఆ స్థాయి విజయం దక్కలేదు. మరోవైపు పరశురామ్ కూడా 'గీత గోవిందం' తర్వాత చేసిన 'సర్కారు వారి పాట'తో నిరాశపరిచారు. ఈ క్రమంలో వీరిద్దరూ మంచి విజయం కోసం మరోసారి చేతులు కలిపి 'ఫ్యామిలీ స్టార్' అనే మూవీ చేశారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉంది? 'గీత గోవిందం' మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఒక చిన్న కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పని చేస్తుంటాడు. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడం, ఒక అన్నయ్య మద్యానికి బానిస అవ్వడం, మరో అన్నయ్య వ్యాపారం పేరుతో తిరుగుతుండటంతో.. కుటుంబ బాధ్యత మొత్తం గోవర్ధన్ తీసుకుంటాడు. ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చుపెడుతూ.. కుటుంబంలోని అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి గోవర్ధన్ జీవితంలోకి.. ఖర్చుకి ఏమాత్రం వెనకాడని ఇందు(మృణాల్ ఠాకూర్) వస్తుంది. గోవర్ధన్ ఇంటి మీద ఆమె అద్దెకు దిగుతుంది. మొదట్లో ఇందుకి దూరంగా ఉంటూ వచ్చిన గోవర్ధన్.. ఆమె చూపిస్తున్న ఇష్టానికి ఫిదా అయ్యి మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. ఇక ఇద్దరూ ఒక్కటవుతారనుకుంటున్న సమయంలో గోవర్ధన్ కి ఊహించని షాక్ తగులుతుంది. ఆ షాక్ ఏంటి? అసలు ఇందు ఎవరు? గోవర్ధన్ జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఆమె రాకతో గోవర్ధన్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఇందుని ప్రేమించిన గోవర్ధన్ తర్వాత ఆమెపై ఎందుకు కోపం పెంచుకున్నాడు? చివరికి ఇందు, గోవర్ధన్ ఒక్కటయ్యారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఈ మధ్య ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా తగ్గిపోయాయి. ఆ లోటుని 'ఫ్యామిలీ స్టార్' భర్తీ చేస్తుందనే అభిప్రాయం విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఏర్పడింది. కానీ సినిమా చూశాక మాత్రం.. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారనే అభిప్రాయం కలగకమానదు.
'గీత గోవిందం' చిత్రంలో కథాకథనాలు, సన్నివేశాలు, సంగీతం ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే అప్పుడు ఆ సినిమా స్టార్ హీరోల సినిమాల స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు విజయ్ తో కలిసి పరశురామ్ మళ్ళీ అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేయాలి అనుకున్నాడు. కానీ అది కొంతవరకే విజయం సాధించింది.
కథలో కొత్తదనంలేదు. కథనంలో కూడా పెద్దగా మెరుపులు లేవు. విజయ్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్టాఫ్ ప్రారంభమవుతుంది. విజయ్ చేసే పొదుపు, చెప్పే మాటలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ లో బడ్జెట్ పద్మనాభం తరహా పాత్రలో విజయ్ కనిపించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పంచాడు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం రిపీటెడ్ గా అనిపిస్తాయి. విజయ్-మృణాల్ మధ్య వచ్చే సన్నివేశాలు పరవాలేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మెప్పించింది. మొత్తానికి ఫస్టాఫ్ లో కొత్తదనం లేనప్పటికీ.. అక్కడక్కడా నవ్వులు పంచుతూ అంతోఇంతో బాగానే నడిచింది. ఇక ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. కథ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది. సెకండాఫ్ అంతా దాదాపు అమెరికాలోనే జరుగుతుంది. ఈ క్రమంలో విజయ్-మృణాల్ పాత్రల మధ్య జరిగే సంఘర్షణ కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. నెమ్మదిగా సాగే కథనం కారణంగా మరీ సాగదీతగా అనిపిస్తుంది. అలాగే అప్పటివరకు సినిమాని నెమ్మదిగా నడిపించి.. పతాక సన్నివేశాలను మాత్రం ఒకేసారి చుట్టేసిన అభిప్రాయం కలుగుతుంది.
ఈ తరంలో ఎక్కువగా కుటుంబ బాధ్యతలు తీసుకోకుండా ఎవరి జీవితం వారు చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కుటుంబం, కుటుంబ బాధ్యత విలువ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా ఆకట్టుకునేలా సినిమాని మలచలేకపోయాడు. అలాగే సినిమాలో చాలా లాజిక్ లు మిస్ అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రని డిజైన్ చేసిన తీరు అంత కన్విన్సింగ్ గా అనిపించదు.యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా తేలిపోయింది.
పరశురామ్ సంభాషణలు మెప్పించాయి. అయితే ఆయన సంభాషణల మీద పెట్టిన శ్రద్ధ కథాకథనాల మీద పెడితే బాగుండేది.'గీత గోవిందం' విజయంలో గోపీ సుందర్ సంగీతం కీలక పాత్ర పోషించింది. కట్టిపడేసే పాటలు, అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఆ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు గోపీ సుందర్. కానీ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ విషయంలో ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. పాటలు, నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. కె.యు. మోహనన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా సెటప్ కి తగ్గట్టుగా ఆయన ఫ్రేమింగ్, లైటింగ్ ఉన్నాయి. సీనియర్ ఎడిటర్ అయిన మార్తాండ్ కె. వెంకటేష్ తన అనుభవంతో చిత్ర నిడివిని కుదించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
గోవర్ధన్ అనే మధ్య తరగతి యువకుడి పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా ఒదిగిపోయాడు. లవ్, కామెడీ, ఎమోషన్.. ఇలా సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. ఇక మృణాల్ ఠాకూర్ తన అందం, అభినయంతో మరోసారి మ్యాజిక్ చేసింది. స్క్రీన్ మీద విజయ్-మృణాల్ జోడి చూడటానికి బాగుంది. జగపతి బాబు, వెన్నెల కిషోర్, రోహిణి హట్టంగడి, వాసుకి, రవి ప్రకాష్, అభినయ, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
'గీత గోవిందం' కాంబినేషన్ లో రూపొందిన సినిమా అనే అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశచెందుతారు. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా కొంతవరకు మెప్పించే అవకాశముంది. విజయ్-మృణాల్ ల అందమైన జోడి, కొన్ని క్యూట్ సన్నివేశాలు, అక్కడక్కడా నవ్వుల కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
- గంగసాని