ఫెయిల్యూర్ ద్వారా వచ్చే డబ్బుతో నేను ఎంజాయ్ చెయ్యలేను : దిల్‌రాజు
on Apr 2, 2024
‘నేను నష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. దాంతో బయటపడతాను. నా కెరీర్‌లో అలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. డబ్బు రావడం, పోవడం చాలా కామన్. వాటన్నింటినీ మించి నేను నిలబడడం అనేది ముఖ్యం. అదే నేను ఆలోచిస్తాను. నా కెరీర్ ప్రారంభంలో ‘దిల్’ చిత్రం ద్వారా వచ్చిన డబ్బు తరుణ్‌తో చేసిన ‘నిన్నే ఇష్టపడ్డాను’తో పోయింది. ఆ తర్వాత నవదీప్‌తో చేసిన ‘జై’ భారీ నష్టాన్నే మిగిల్చింది. వరస నష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టైమ్‌లో ‘ఆర్య’ వచ్చి నన్ను నిర్మాతగా నిలబెట్టింది. నష్టపోయినా మళ్ళీ సక్సెస్ వస్తుందన్న నమ్మకం నాకు ఉంటుంది. ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదు, సక్సెస్ అనేది ఇంపార్టెంట్. డబ్బుని లవ్ చేయడం మొదలుపెడితే.. మనం దాని వెంటే తిరగాలి. ఆ సమయంలో సక్సెస్ పర్సెంటేజ్ లెక్కల్లో తేడాలు వస్తాయి. నాకు సక్సెస్‌తోపాటు డబ్బు కూడా కావాలి. ఫెయిల్యూర్స్ వల్ల వచ్చే డబ్బు నాకు అవసరం లేదు. ఎందుకంటే దాన్ని నేను ఎంజాయ్ చెయ్యలేను’ అంటూ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలను పంచుకున్నారు దిల్‌రాజు.
తాజాగా విజయ్ దేవరకొండ, పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని నిర్మించారు దిల్‌రాజు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో విజయ్, పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ ‘ఫామిలీ స్టార్’గా వస్తున్నారు. ప్రస్తుతం దిల్‌రాజు ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే తన కెరీర్‌లోని ఒడిదుడుకుల గురించి కూడా ప్రస్తావించారు దిల్‌రాజు. ‘ఏదైనా సినిమా సక్సెస్ అవుతుంది అనిపిస్తే చెప్పేస్తాను. అది నిజంగానే పెద్ద హిట్ అవుతుంది. నాకు ఏదో ఒక చోట డౌట్ అనేది వచ్చిందంటే.. ఆ సినిమా ఆడనట్టే లెక్క. మా బేనర్‌లో చేసిన ‘మున్నా’ చూసినపుడు నాకు అలాంటి ఫీలింగే కలిగింది. షో పూర్తయిన తర్వాత ‘ఈ సినిమా డిజప్పాయింట్ చెయ్యొచ్చు. మీరు ఫీల్ కావద్దు’ అని డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి చెప్పాను. ఆమధ్య మేం రిలీజ్ చేసిన ‘చెలియా’ పరిస్థితి కూడా అదే. ఒక బ్యాడ్ ఫిల్మ్‌ని తీసుకొని రాంగ్ స్టెప్ వేశాం అని చెప్పాను’ అంటూ తన ఫెయిల్యూర్స్ గురించి చెప్పారు.
పెద్ద సినిమాలకు హీరోలు, దర్శకులు ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ‘పెద్ద సినిమాలకు హీరో, దర్శకులు చాలా ఇంపార్టెంట్. సినిమా రేంజ్‌ని డిసైడ్ చేసేది హీరోనే. కాబట్టి.. హీరో రేంజ్‌కి తగ్గట్టుగానే దర్శకుడు, టెక్నీషియన్స్‌ని సెట్ చేయాలి. ఆ క్రమంలో ఖర్చు పెరిగిపోతే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ఎవరినీ బాధ్యుల్ని చేయలేం. అలాంటి పరిస్థితి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాకి వచ్చింది. మహేష్‌బాబు, వెంకటేష్‌లతో మాట్లాడాను. రెమ్యునరేషన్ విషయంలో వారు కొంత ఫేవర్ చేశారు. ఎందుకంటే ఆ కథ అలాంటిది. ఇద్దరు హీరోలూ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ మహేష్‌బాబు అని చెప్పొచ్చు. సినిమా చాలా నేచురల్‌గా ఉండాలి. సెట్స్, ఫైట్స్ అంటూ హడావిడి చెయ్యొద్దు అన్నారు. ఆయన చెప్పినట్టుగానే సినిమాని తీశాం. స్టార్స్‌తో సినిమాలు తియ్యాలంటే వారికున్న స్టార్ వాల్యూని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో సినిమా అంటే వారి రేంజ్‌కి తగ్గట్టే ఉంటుంది. ఒక కథను ఒకరితో అనుకొని మరొకరితో చెయ్యలేం’ అంటూ వివరించారు దిల్‌రాజు.