సినిమాలకు బాలయ్య బ్రేక్!
on Mar 27, 2024
తెలుగునాట నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు మాస్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన సినిమా వచ్చిందంటే 'జై బాలయ్య' నినాదాలతో థియేటర్లు మారుమోగిపోతాయి. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకొని.. ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య నుంచి నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందా? అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ తదుపరి చిత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే ఆయన సినిమాలకు చిన్న బ్రేక్ ఇవ్వబోతున్నారు.
బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం(Hindupuram) నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి బాలయ్య సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండు నెలలు కూడా సమయం లేదు. ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే బాలయ్య సినిమాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
కేవలం హిందూపురం నియోజకవర్గం మాత్రమే కాకుండా.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేయగల క్రేజ్ బాలకృష్ణ సొంతం. అందుకే తెలుగుదేశం పార్టీ(Telugudesam Party) తరపున రాష్ట్రవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసే అవకాశముంది. ముఖ్యంగా రాయలసీమలో బాలయ్య క్రేజ్ ని ఎవరూ టచ్ చేయని స్థాయిలో ఉంటుంది. ఆయన రాయలసీమలో ప్రచారం చేస్తే టీడీపీకి ఎంతో ప్లస్ అవుతుంది. అందుకే అత్యంత కీలకమైన ఈ ఎన్నికల టైంలో.. తన పూర్తి సమయాన్ని తెలుగుదేశం తరపున ప్రచారం చేయడానికి కేటాయించాలని బాలయ్య నిర్ణయించుకున్నారట. ఆ కారణంగా ఆయన దాదాపు రెండు నెలల పాటు పూర్తిగా షూటింగ్ కి దూరం కానున్నారని సమాచారం.
కాగా బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య షూటింగ్ బ్రేక్ ఇస్తుండటంతో.. ఆ సమయానికి విడుదల కావడం అనుమానమే. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.
Also Read