అరుంధతి పరిస్థితి విషమం.. సహాయం కోరుతున్న కుటుంబం!
on Mar 22, 2024
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 14న ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా కోవలం బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె త్రివేండ్రంలోని అనంతపురి హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. అరుంధతి తలకు తీవ్రంగా గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డ కట్టింది. అంతేకాదు ప్రమాదం తీవ్రస్థాయిలో జరగడంతో పక్కటెముకలు కూడా విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. ఆమెకు చికిత్స నిమిత్తం భారీ మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని తెలియడంతో అరుంధతి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
దీనికి సంబంధించి అరుంధతి సోదరి ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘నా సోదరికి జరిగిన యాక్సిడెంట్‌లో ఆమె తీవ్రంగా గాయపడిన విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం పొజిషన్ క్రిటికల్‌గా ఉంది. ఆస్పత్రికి సంబంధించిన బిల్లులు మాత్రం చెల్లించగలుగుతున్నాం. రెండు వారాల్లో ఆమెకు కొన్ని సర్జరీలు చెయ్యాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. వాటికి సరిపడే డబ్బు మా దగ్గర లేదు. అందుకే ఫండ్ రైజింగ్ చెయ్యాలనుకున్నాం. మేం చేస్తున్నది స్కామ్ అంటూ చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. వారందరికీ మేము ఒకటే చెబుతున్నాము. అనుకోని ఆపద వచ్చింది. సోదరి ప్రాణాలు కాపాడేందుకు సాయం చెయ్యమని అడుగుతున్నాం. మీకు తోచినంత సాయం చెయ్యండి’ అంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తోంది.
Also Read