ఎట్టకేలకు మోక్షజ్ఞకు డైరెక్టర్ దొరికాడు.. మొదటి సినిమాకే ఇంత రిస్క్ అవసరమా?
on Mar 18, 2024
నటసింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వారికి గుడ్ న్యూస్ అందే అవకాశముంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ తెరవెనుక అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను ప్రముఖ దర్శకుడు బోయపాటికి బాలయ్య అప్పగించినట్లు సమాచారం.
మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. నిజానికి 'ఆదిత్య 369' సీక్వెల్ తో మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని కూడా బాలకృష్ణ భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను ఈ డైరెక్టర్ కే ఇచ్చాడంటూ ఎన్నో పేర్లు వినిపించాయి. వారిలో బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, క్రిష్, అనిల్ రావిపూడి వంటి వారు ఉన్నారు. ఆ మధ్య అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు. ఇలా ఎవరో ఒక డైరెక్టర్ పేరు తెర మీదకు రావడం, ఆ తర్వాత ఏ చప్పుడు లేకపోవడం.. కొన్నాళ్లుగా ఈ తంతు జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. బోయపాటి పైనే బాలయ్య భారం వేసినట్లు వినికిడి.
టాలీవుడ్ లో బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటిదాకా వీరి కాంబోలో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' అనే మూడు సినిమాలు రాగా.. మూడూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నాలుగోసారి కూడా చేతులు కలపడానికి రెడీగా ఉన్నారు. బోయపాటి ప్రతిభపై బాలయ్యకు ఎంతో నమ్మకం. పైగా బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ తో లాంచ్ చేయిస్తే.. మోక్షజ్ఞ మొదటి నుంచో మాస్ లోకి బలంగా చొచ్చుకొని పోతాడని బాలకృష్ణ భావిస్తున్నారట. అందుకే మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యత బోయపాటికి అప్పగించారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని అంటున్నారు. దీంతో తన సినిమాల్లో బాలయ్యని ఓ రేంజ్ చూపించే బోయపాటి.. మోక్షజ్ఞను ఎలా చూపిస్తారోనన్న ఆసక్తి నెలకొంది.
Also Read