ఇదెక్కడి ట్విస్ట్.. హీరోని, డైరెక్టర్ ని పక్కన పెట్టేసిన దిల్ రాజు!
on Mar 7, 2024
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో 'శతమానం భవతి' ఒకటి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. బరిలో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఉన్నప్పటికీ కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. నేషనల్ అవార్డుతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ సీక్వెల్ రాబోతుంది.
'శతమానం భవతి' సినిమాకి సీక్వెల్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. "శతమానం భవతి నెక్స్ట్ పేజి లోడింగ్ సూన్.. వచ్చే సంక్రాంతికి కలుద్దాం" అంటూ ఒక పోస్టర్ ను వదిలారు. అయితే ఆ పోస్టర్ లో హీరో, డైరెక్టర్ వంటి వివరాలు లేకపోవడంతో.. సీక్వెల్ కి నటీనటులు, దర్శకుడు మారిపోనున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిని నిజం చేస్తూ దిల్ రాజు నిజంగానే ట్విస్ట్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో హీరోగా శర్వానంద్ చేయడంలేదట. దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటించనున్నాడని సమాచారం. 'రౌడీ బాయ్స్' సినిమాతో హీరోగా పరిచయమైన ఆశిష్.. ప్రస్తుతం 'లవ్ మీ' అనే సినిమా చేస్తున్నాడు. ఆశిష్ ని మంచి హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న దిల్ రాజు.. 'శతమానం భవతి' సీక్వెల్ ని అతనితో తీయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. 'శతమానం భవతి' చిత్రంలో స్వచ్ఛమైన మనసున్న పల్లెటూరి యువకుడిగా శర్వానంద్ తనదైన నటనతో స్క్రీన్ మీద మ్యాజిక్ చేశాడు. మరి ఆ మ్యాజిక్ ని ఆశిష్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
అంతేకాదు, 'శతమానం భవతి' సీక్వెల్ కి సతీష్ వేగేశ్న స్థానంలో మరో దర్శకుడు పని చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. 'శతమానం భవతి' లాంటి సినిమాకి సీక్వెల్ చేయడమే రిస్క్ తో కూడుకున్నది. అలాంటిది హీరో శర్వానంద్, డైరెక్టర్ సతీష్ వేగేశ్నను పక్కన పెట్టి.. దిల్ రాజు సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడనే వార్త సంచలనంగా మారింది.
Also Read