అందుకే బాలయ్యకు నో చెప్పా.. జనసేనలో చేరడంపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్!
on Mar 7, 2024
ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ ఒకడు. తెలుగుతెరకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో పాటు తన మాటలతోనో, ఆటిట్యూడ్ తోనో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు విశ్వక్. టీవీ యాంకర్ తో గొడవ అనో, మరో యంగ్ స్టార్ ని పరోక్షంగా ఏదో అన్నాడనో.. ఇలా పలు వివాదాల్లో విశ్వక్ పేరు మారుమోగింది. అలాంటి ఈ యంగ్ హీరో ఈమధ్య ఆచితూచి మాట్లాడుతున్నాడు.
విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. ఈ శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ప్రమోషన్స్ లో విశ్వక్ చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మీడియా నుంచి పలు ఆసక్తికర ప్రశ్నలు ఎదురుకాగా.. సూపర్ ఆన్సర్స్ తో ఇంప్రెస్ చేశాడు.
అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు అనుకూలంగా ఉండేవారట. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ "మీ తండ్రి ప్రజారాజ్యానికి సపోర్ట్ చేసినట్లుగా.. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో చేరే అవకాశముందా?" అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. నిజానికి ఇది విశ్వక్ ని ఇరుకున పెట్టే ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి మొదలైంది. ఇలాంటి సమయంలో జనసేనకు అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో కామెంట్స్ చేస్తే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆ ప్రభావం తన సినిమాపై కూడా పడే అవకాశముంది. అందుకే ఊహించని సమాధానంతో తెలివిగా తప్పించుకున్నాడు విశ్వక్. "నేను డోనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఫ్యాన్ ని.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లి ఓటేస్తాను" అంటూ సూపర్ ఆన్సర్ తో రాజకీయ వివాదం నుంచి ఎస్కేప్ అయ్యాడు.
ఇక నందమూరి బాలకృష్ణతో విశ్వక్ సేన్ కి మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అలాంటిది బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశమొస్తే.. విశ్వక్ నో చెప్పాడనే వార్త బాలయ్య అభిమానులను నిరాశపరిచేదే. కానీ నో చెప్పడానికి గల కారణాన్ని విశ్వక్ వివరించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం విశ్వక్ ని సంప్రదించగా ఆయన నో చెప్పాడట. గామి మూవీ ప్రమోషన్స్ లో.. తాను నో చెప్పడానికి గల కారణాన్ని చెప్పాడు విశ్వక్. దర్శకుడు బాబీ చెప్పిన పాత్ర బాగుందని, కానీ బాలయ్య సినిమాలో పాత్ర అంటే ఇంకా వేరే లెవెల్ లో ఉండాలన్న ఉద్దేశంతోనే నో చెప్పానని అన్నాడు. అంతేకాదు బాలకృష్ణ గారితో వేరే పెద్ద ప్లాన్ చేస్తున్నానని తెలిపాడు. అంటే భవిష్యత్ లో బాలయ్య-విశ్వక్ కాంబినేషన్ లో సినిమా రానుంది అన్నమాట. మొత్తానికైతే 'గామి' ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చెప్పిన సమాధానాలు అందరూ మెచ్చుకునేలా ఉన్నాయి.