2 రోజుల్లోనే 11 లక్షల వ్యూస్, 2 లక్షల లైక్స్.. ట్రెండింగ్‌లో రవితేజ సినిమా!
on Feb 24, 2024
మాస్‌రాజా రవితేజ సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది. రవితేజ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ పెర్‌ఫార్మెన్స్, సినిమా మేకింగ్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే హిందీ వెర్షన్ థియేటర్లలో ఎక్కువ వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ తెలుగు, హిందీ వెర్షన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హిందీ ఆడియన్స్‌ని సైతం మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా హిందీ వెర్షన్‌ను యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
కేవలం 2 రోజుల్లోనే 11 మిలియన్ల వ్యూస్, 2 లక్షల లైక్‌లను సాధించి రవితేజ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది ‘టైగర్ నాగేశ్వరరావు’. యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వెర్షన్ 2 గంటల 24 నిమిషాల నిడివితో ఉంది. మొదట థియేటర్‌లో విడుదల చేసిన వెర్షన్ రన్ టైమ్ 3 గంటలకు మించి ఉంది. దాన్ని 2 గంటల 24 నిమిషాలకు తగ్గించడంతో వ్యూస్ విపరీతంగా పెరిగాయి. రెండు రోజుల్లో 11 మిలియన్ వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు. అందుకే యూ ట్యూబ్ టాప్ 10 లిస్ట్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో రిలీజ్ అయినపుడు డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను సాధ్యమైనంత సహజంగా తెరకెక్కించాలన్న ఉద్దేశంతో టైగర్ నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను ఇందులో పొందుపరిచారు డైరెక్టర్ వంశీ. దాంతో సినిమా లెంగ్త్ విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మొదట థియేటర్లలో రిలీజ్ చేసినపుడు 3 గంటల 2 నిమిషాల నిడివితో ఉంది. సినిమా బాగున్నప్పటికీ రన్‌టైమ్ ఎక్కువైందని ఆడియన్స్ ఫీల్ అవ్వడంతో దాన్ని 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. దీంతో థియేటర్లలో రెస్పాన్స్ కూడా బాగా పెరిగింది. ఇదే రన్‌టైమ్‌తో మొదట్లోనే రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు యూ ట్యూబ్‌లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఇంతటి సంచలనం సృష్టించడానికి రన్‌టైమ్‌ను మరింత తగ్గించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
మాస్‌రాజా రవితేజ ఎక్స్‌లెంట్ పెర్‌ఫార్మెన్స్, డైరెక్టర్ వంశీ పర్‌ఫెక్ట్ టేకింగ్ సినిమాని ఒక రేంజ్‌లో నిలబెట్టాయి. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కూడా దాదాపు అంతే వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఓటీటీలో తన సత్తా ఏమిటో చూపిస్తోంది. ఓటీటీలో, యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా ‘టైగర్ నాగేశ్వరరావు’ కొత్త రికార్డులు సృష్టిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read