దర్శకులకి కోపం తెప్పిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్!
on Feb 22, 2024
తమిళనాడుకి చెందిన సంగీత దర్శకుడు రధన్.. 'అందాల రాక్షసి', 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'అర్జున్ రెడ్డి', 'జాతిరత్నాలు' వంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇతని పేరు వింటేనే అతనితో పని చేసిన కొందరు దర్శకులు మండిపడుతున్నారు.
రధన్ సంగీతం అందించిన తాజా తెలుగు చిత్రం 'సిద్ధార్థ్ రాయ్' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు యశస్వి మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు రధన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మా సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం చాలా ఆలస్యమైంది. దానికి కారణం రధన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. నాలాగా ఎవరూ మోసపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెబుతున్నాను. అద్భుతమైన టెక్నీషియన్ అని అతని దగ్గరకు మనం వెళ్తున్నాం.. కానీ అతని చేతుల్లో పడి సినిమా నలిగిపోతుంది. అసలు రధన్ అనే వ్యక్తి గొడవపడటానికే మాట్లాడతాడు. ఫోన్ లో గంటలు గంటలు వాదన పెట్టుకుంటాడు. రధన్ చెన్నై లో ఉండి బ్రతికిపోయాడు.. ఇక్కడుంటే చాలా గొడవలు అయ్యేవి" అని దర్శకుడు యశస్వి చెప్పుకొచ్చాడు.
'అర్జున్ రెడ్డి' సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సైతం రధన్ గురించి ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. "రధన్ తో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే.. బాగా ఆలస్యం చేస్తాడు. నేనే నిర్మాతగా డబ్బులు పెట్టి ఉన్నాను కాబట్టి.. అతన్ని తప్పక భరించాను. ఒక్కోసారి ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడాల్సి వచ్చేది. అతని వెంటపడి సాంగ్స్ రికార్డు చేయించుకోవాల్సి వచ్చింది. అందుకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో చేయించుకున్నాను." అని అప్పట్లో సందీప్ రెడ్డి అన్నాడు.
ఇలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి దర్శకులు కామెంట్స్ చేస్తుండటం.. ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.