'ఊరు పేరు భైరవకోన' మూవీ రివ్యూ
on Feb 16, 2024
సినిమా పేరు: ఊరు పేరు భైరవకోన
తారాగణం: సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవి శంకర్, వడివుక్కరసి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఎ రామాంజనేయులు
రచన, దర్శకత్వం: వీఐ ఆనంద్
నిర్మాత: రాజేష్ దండా
సమర్పణ: అనిల్ సుంకర
బ్యానర్: హాస్య మూవీస్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: ఫిబ్రవరి 16, 2024
నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక విభిన్న చిత్రాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వీఐ ఆనంద్ కూడా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత ఆ స్థాయి విజయం కోసం చూస్తున్నాడు. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి 'టైగర్' తర్వాత సందీప్-ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఇద్దరికీ హిట్ అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
భైరవకోన అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలోకి ఎవరైనా వెళ్తే.. పైకి పోవడమే తప్ప.. బయటకు రాలేరు. అలాంటి ఊరిలోకి బసవ(సందీప్ కిషన్), గీత(కావ్య థాపర్), జాన్(వైవా హర్ష) అనుకోకుండా అడుగు పెడతారు. అక్కడ వారికి ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అసలు భైరవకోన ఊరి కథ ఏంటి? ఆ ఊరికి గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలకు సంబంధం ఏంటి? భూమి(వర్ష బొల్లమ్మ) ఎవరు? ఆమె కోసం బసవ దొంగగా ఎందుకు మారాడు? భైరవకోనకు, భూమికి సంబంధం ఏంటి? భైరవకోన నుంచి బసవ, గీత, జాన్ ప్రాణాలతో బయటపడగలిగారా? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
తన సినిమాల్లో వైవిధ్యం చూపించాలి అనుకునే దర్శకుల్లో వీఐ ఆనంద్ కూడా ఒకడు. ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' కోసం కూడా "గరుడ పురాణంలో నాలుగు పేజీలు మిస్సింగ్" అనే ఆసక్తికరమైన పాయింట్ ను ఎంచుకున్నాడు. కానీ కథను దాని చుట్టూ అల్లుకోవడం మానేసి.. ఏదో రెగ్యులర్ హారర్ కామెడీ సినిమాలా మలిచాడు. అసలు ప్రచార చిత్రాల్లో "గరుడ పురాణం" అనే పాయింట్ ఉండటం వల్లే.. చాలామందికి ఈ సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది. కానీ దర్శకుడు ఆనంద్ మాత్రం.. ఆ పాయింట్ ని మొక్కుబడిగా ఒకట్రెండు సన్నివేశాల్లో మాత్రమే చూపించి నిరాశపరిచాడు.
సందీప్ కిషన్, వైవా హర్ష పాత్రలను దొంగలుగా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వీరు అనుకోని పరిస్థితుల్లో కావ్య థాపర్ తో కలిసి భైరవకోనలోకి ప్రవేశిస్తారు. భైరవకోనలో ఏం జరుగుతుంది? భూమి(వర్ష బొల్లమ్మ) ఎవరు? ఆమె కోసం సందీప్ కిషన్ ఎందుకు దొంగగా మారాడు? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ సినిమా ఆసక్తికరంగానే మొదలైంది. కానీ కథలోకి వెళ్లే కొద్దీ రొటీన్ సన్నివేశాలు, నెమ్మదిగా సాగే కథనంతో ఫస్టాఫ్ అక్కడక్కడా బోర్ కొడుతుంది. సందీప్ కిషన్-వర్ష బొల్లమ్మ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా లేవు. ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే హారర్ కామెడీ సన్నివేశాలు మాత్రం మెప్పిస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇంటర్వెల్ ఇచ్చిన హైతో సెకండాఫ్ అదిరిపోతుంది అనుకుంటే.. మళ్ళీ తేలిపోతుంది. భైరవకోనకి, గరుడ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలకు సంబంధం ఏంటి? అనేది మొక్కుబడిగా చెప్పినట్లు ఉంటుంది. సెకండాఫ్ లో వచ్చే హారర్ కామెడీ ఎపిసోడ్ తప్ప మిగతా అంతా పెద్దగా మెప్పించదు. తరువాత ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ ఎక్కడా కలగదు. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా లేవు. అయితే ఈ సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఆ కామెడీ డోస్ ని మరింత పెంచినట్లయితే.. మిగతా లోపాలన్నీ కనుమరుగైపోయేవి.
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ కట్టిపడేసింది. శేఖర్ చంద్ర సంగీతం ఆకట్టుకుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎ రామాంజనేయులను ప్రత్యేకంగా అభినందించాలి. భైరవకోన అనే కల్పిత ఊరును అద్భుతంగా సృష్టించాడు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కాస్త కత్తెరకు పని చెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
బసవ పాత్రలో సందీప్ కిషన్ సునాయాసంగా ఒదిగిపోయాడు. ప్రేమ కోసం ప్రాణాలను పణంగా పెట్టే యువకుడి పాత్రలో అతని నటన మెప్పించింది. గిరిజన అమ్మాయి భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ ఆకట్టుకుంది. తెరమీద తక్కువసేపే కనిపించినా తన మార్క్ చూపించింది. ఇక దొంగ అయినటువంటి చలాకీ అమ్మాయి గీత పాత్రలో కావ్య థాపర్ చక్కగా రాణించింది. వైవా హర్షకి మంచి పాత్ర దక్కింది. తనదైన కామెడీతో బాగానే నవ్వించాడు. డాక్టర్ నారప్పగా వెన్నెల కిషోర్ బాగానే నవ్వులు పంచాడు. రవి శంకర్, వడివుక్కరసి, బ్రహ్మాజీ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా...
హారర్ కామెడీ జానర్ చిత్రాలను ఇష్టపడేవారు పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే 'ఊరు పేరు భైరవకోన' నచ్చుతుంది. ప్రచార చిత్రాలను చూసి భారీ అంచనాలతో సినిమాకి వెళ్తే మాత్రం నిరాశచెందుతారు.
రేటింగ్: 2.25/5