చంద్రబాబు పాత్రలో మహేష్
on Oct 27, 2023
దివంగత నాయకుడు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల ముందు అంటే 2019లో రిలీజైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అందులో వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వై.ఎస్.ఆర్ తనయుడు వై.ఎస్.జగన్ చేసిన పాదయాత్ర, 2009-2019 కాలం మధ్యలో జరిగిన ఘటనల ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి.రాఘవ. ఇందులో కోలీవుడ్ స్టార్, రంగం ఫేమ్ జీవా.. వై.ఎస్.జగన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి బయటకు వచ్చింది.
‘యాత్ర 2’లో నారా చంద్రబాబు నాయుడు పాత్రను చూపించబోతున్నారు. నిజానికి యాత్రలో ఇతర రాజకీయ నాయకుల పాత్రలను చూపించలేదు. కానీ యాత్ర 2లో మాత్రం చూపించబోతున్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ ఓదారు యాత్ర చేయటం, జైలుకు వెళ్లటం, మళ్లీ బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేయటం, ముఖ్యమంత్రిగా గెలవటం వరకు ఈ యాత్ర 2 మూవీ ఉంటుందని సినీ సర్కిల్స్ సమాచారం. ఇందులో చంద్ర బాబు నాయుడు పాత్రలో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ కనిపించబోతున్నారు. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.
సాధారణంగా ఇలాంటి సినిమాలను తెరకెక్కించే సమయంలో నిజమైన పాత్రలను పోలిన లక్షణాలతో క్యారెక్టర్స్‌ను నటీనటులు పోషిస్తుంటారు. కానీ మహి వి.రాఘవ్ మాత్రం అలా చేయటం లేదు. పాత్రకు సంబంధించిన ఎమోషన్స్‌ను క్యారీ చేసే నటీనటులను మాత్రమే ఆయన ఎంచుకుంటారు. ఆ కోవలోనే మహేష్ మంజ్రేకర్‌ను ఎంచుకున్నారట. మరి యాత్ర 2లో ఇతర రాజకీయ నాయకులు ఎవరు కనిపించబోతున్నారనేది మరింత ఆసక్తికరంగా మారనుంది. యాత్ర 2 చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2024లో విడుదల చేస్తున్నారు.
Also Read