'పెదకాపు'కి అండగా బాలయ్య!
on Sep 21, 2023
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'పెదకాపు'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
'పెదకాపు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం(సెప్టెంబర్ 23న) సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ వేడుకకి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం. బాలయ్య బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'అఖండ'కి మిర్యాల రవీందర్ రెడ్డినే నిర్మాత. ఆ అనుబంధంతోనే 'పెదకాపు'కి బాలయ్య తన సపోర్ట్ ఇవ్వడానికి వస్తున్నారట. ఏది ఏమైనా బాలయ్య రంగంలోకి దిగితే 'పెదకాపు'పై మరింత బజ్ పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.
'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలతో క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల.. 'నారప్ప' నుంచి ట్రాక్ మార్చాడు. ఇక ఇప్పుడు 'పెదకాపు'తో అసలుసిసలైన మాస్ చూపించడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ఒక పవర్ ఫుల్ పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేష్, నాగబాబు, తనికెళ్ళ భరణి, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read