ఎన్టీఆర్ వజ్రోత్సవం.. 'మనదేశం' విడుదలై నేటికి 75 వసంతాలు...
on Nov 24, 2024
మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం 'మనదేశం' విడుదలై నేటికి 75 వసంతాలు పూర్తయింది. దర్శకుడు ఎల్వీ ప్రసాద్ రూపొందించిన 'మనదేశం' 1949, నవంబర్ 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రతో సినీ నటునిగా ప్రేక్షకులకు పరియచయమయ్యారు ఎన్టీఆర్. పాత్ర చిన్నదైనా నటుడిగా ఎంతో ప్రభావం చూపారు. 'మనదేశం' తర్వాత ఎన్టీఆర్ వెనుతిరిగి చూసుకోలేదు. షావుకారు, పల్లెటూరి పిల్ల, పాతాళ భైరవి, మల్లీశ్వరి వంటి సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. తన అసాధారణ నటనతో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాలు చేస్తూ నటసార్వభౌముడు అనిపించుకున్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవంగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. (NTR Mana Desam)
అలాంటి మహానటుడి సినీ ప్రస్థానానికి పునాది వేసిన 'మనదేశం' చిత్రం నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, నటుడిగా తాను 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. "నేను అనునిత్యం స్మరించే పేరు.. నా గురువు, దైవం, స్ఫూర్తి మా నాన్న ఎన్టీఆర్ గారు వెండితెరపై 'మన దేశం' చిత్రంతో దర్శనమిచ్చి ఈ నవంబర్ 24తో 75 ఏళ్ళు పూర్తిచేసుకొని 'వజ్రోత్సవం' జరుపుకుంటున్న ఈ సంవత్సరమే, హీరోగా నేను 50 ఏళ్ళు పూర్తి చేసుకొని 'స్వర్ణోత్సవం' జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాన్న గారి నుంచి నన్ను, నా కుటుంబ సభ్యులను ఆదరిస్తున్న నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్ళకు, నా సినీ ప్రయాణంలో నాకు అడుగడుగునా సహకరించిన తోటి కళాకారులకు, దర్శకనిర్మాతలకు, సాంకేతికనిపుణులకు, పంపిణీదారులకు, థియోటర్స్ యాజమాన్యం & సిబ్బందికి, మీడియాకి , అన్ని విభాగాల సినీ కార్మికులకు, నా ఉన్నతిని కోరే ఆత్మీయ శ్రేయోభిలాషులందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను." అని బాలకృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read